కేటీఆర్ పై టిడిపి ఎమ్యెల్యే పొగడ్తల జల్లు!

Friday, June 15th, 2018, 12:58:38 AM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటిఆర్ పై హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్యెల్యే ఆర్ కృష్ణయ్య పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన నియోజకవర్గంలో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ ను అన్ని విధాలా విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తలంపుతో తమ ప్రతిపక్ష ఎమ్యెల్యేల నియోజకవర్గాలపై కూడా శ్రద్ధ చూపుతూ కోట్లు ఖర్చు చేస్తూ అభివృద్ధి చేస్తున్న కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలని మాట్లాడారు. ఇక ఇదివరకు టిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడిన ఆయన కొన్నాళ్ల క్రితం జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వుత్సవాల సభలో సీఎం కేసీఆర్ ను పొగిడారు.

బిసిలకు ఏ సీఎం ఇవ్వనంతగా కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ విధంగా బిసిలకు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ గారికి శుభాభినందనలు తెలిపారు. ఇక ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడిన ఆయన గత కొద్దికాలంగా పార్టీ చేపట్టిన అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన టిఆర్ఎస్ ను అలానే కేసీఆర్, కేటీఆర్ లను పొగడడం చూస్తుంటే ఆయన టీడీపీ పై తీవ్ర అసంతృప్తితో వున్నారని, అలానే వారికి దగ్గరవ్వాలని ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా పోగుతున్నారని అంటున్నారు. అయితే ఆయన టిఆర్ఎస్ నాయకుల పై చేసిన వ్యాఖ్యలపై కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే తప్పుపడుతున్నట్లు సమాచారం…….