టీడీపీ ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారుగా..!

Sunday, May 26th, 2019, 02:00:47 AM IST

ఏపీలో గత నెలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మొన్న విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రధానంగా మూడు పార్టీలు మధ్య పోటీ తీవ్రంగా కనిపించినా గెలుపు మాత్రం ఏకపక్షంగా అనిపించింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాలను గెలుచుకుంటే, టీడీపీ 23 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, జనసేన ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇక పార్లమెంట్ స్థానాలలో కూడా మొత్తం 25 స్థానాలు ఉంటే 22 స్థానాలను వైసీపీ గెలవగా, కేవలం మూడు స్థానలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది.

అయితే ఎవరూ ఊహించని విధంగా వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే, టీడీపీ మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడాన్ని టీడీపీ ఎన్నారైలు జీర్ణించుకోలేకపోతున్నారట. అంతేకాదు వారి సోషల్ మీడియా గ్రూపులలో కూడా గత రెండు రోజుల నుంచి ఇవే చర్చలు నడుస్తున్నాయట. అసలు టీడీపీ అంతలా ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే విషయాలను ఎవరికి వారే ఊహించి చెబుతున్నారట. అయితే కొందరు ఈ వర్గం, ఆ వర్గం అనకుండా అందరూ జగన్‌కే మద్ధతు తెలిపారని సొంత వారు కూడా చంద్రబాబును మోసం చేశారని అంటున్నారట. అయితే దీనిపై కొంత మంది స్పందిస్తూ కులాలతో రాజకీయాలు చేయకండి అంటూ రిప్లైలు వస్తున్నాయట. ఇలా ఒకరికి ఒకరికి మధ్య గ్రూపులలోనే వాగ్విదాలు వస్తున్నాయట. అయితే కొందరేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అంటుంటే. అలాంటి టెక్నాలజీ ఇంకా రాలేదని అది అవాస్తవమని అంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ మార్పును కోరుకున్నారని అందుకే జగన్‌కి ఓట్లు వేసారని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా వీరిలో వీరిలో ఇప్పుడు బాగానే చర్చలు నడుస్తున్నాయట.