బిజెపి నేత ఇంటి ముందు టిడిపి నాయకుల ధర్నా!

Tuesday, February 6th, 2018, 08:41:49 AM IST

ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాష్ట్ర రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా అధికార టీడీపీ-బీజేపీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా పార్టీ సమావేశాల్లో చేసుకున్న విమర్శలు ఇప్పుడు శృతిమించి ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకునే స్థాయికి చేరాయి. బీజేపీ సీనియర్ నేత ఎమ్యెల్సీ సోము వీర్రాజు కామెంట్లు ఇందుకు నిదర్శనంగా అంటున్నారు. అదే సమయంలో ఆయన ఇంటిముందు టీడీపీ నాయకులు ఆందోళన చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ వివాదం రాష్ట్రస్థాయికే పరిమితం కాకుండా కేంద్ర బీజేపీ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీనిపై సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతుందన్నారు. చంద్రబాబు నియోజకవర్గం లో పది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించగా,దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.

వీర్రాజు ఇంటివద్ద ఆందోళన తెలిపాయి. అయితే వీళ్లు టీడీపీ నేతలు కాదని పార్టీ వివరణ ఇచ్చినప్పటికీ, వాళ్లు టీడీపీ నాయకులే అని వీర్రాజు వర్గం నొక్కి వక్కాణిస్తోంది. దానికి సంబంధించి ఆయన కొన్ని ఫోటోలను పేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇది ఇంటర్నెట్ యుగమని, నిజాలు దాగవని పేర్కొన్నారు. మరోవైపు ఈ నిరసనను కేంద్ర హోంశాఖ ఆరాతీసిందని, జరుగుతున్న పరిణామాలన్నీ కేంద్ర ప్రభుత్వం ద్రుష్టికి వెళతాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న వారు ఎవరు, వారి వెనుక ఎవరున్నారు అనే అంశాల పై కేంద్ర హోమ్ శాఖకు నిఘా నివేదిక వెళ్లినట్లు సమాచారం. తెలుగు దేశానికి చెందిన బీసీ కార్యకర్తలమంటూ కొంతమంది వ్యక్తులు మా ఇంటి వద్ద ధర్నా అని చెప్పి పోలీసులు ను చూసి ఆఫీస్ కు వెళ్లారు. అయితే ఆఫీస్ వద్ద వున్న బీజేపీ కార్యకర్తల ను చూసి వారు పలాయనం చిత్తగించారని అన్నారు. తాను టీడిపి పై చేసిన వ్యాఖ్యలకు కట్టుపాటి వున్నానని, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ ని పూర్తిగా తొక్కి పట్టాలని చూస్తుందని, ఈ విధమైన టిడిపి వ్యవహార శైలి మంచిది కాదని హితవుపలికారు. అయితే ఈ ఘటన విషయమై కేంద్ర బిజెపి, రాష్ట్ర టిడిపి అధిష్టానాలు నుండి స్పందన రావలసి వుంది….