పరకాలను ఇరకాటంలో పడేసిన టీడీపీ!

Thursday, May 24th, 2018, 03:34:46 PM IST

గత నాలుగు సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారుగా వ్యవహరిస్తున్న పరకాల ప్రభాకర్ ను ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఒకరకంగా డైలమాలో పడేసిందని చెప్పాలి. ఇటీవల కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూడా ముఖ్యమైన విషయాల్లో ఆయనను సంప్రదించడంలేదని సమాచారం. ఇటీవల కేంద్రప్రభుత్వంతో టీడీపీ వారు తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తదనంతరం ఎదురయ్యే రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన్ని పక్కనపెట్టారట. నిజానికి పరకాల ప్రస్తుతం తమ ప్రభుత్వంలో ఉంటే కేంద్రానికి తమకు సంబంధించిని ముఖ్యమైన సమాచార, వ్యవహారాలన్నీ చేరవేస్తారనే భయం టీడీపీ నేతల్లో, ముఖ్యంగా చంద్రబాబు మదిలో నెలకొందట. అందువల్ల ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం తరపున మీడియా సలహాదారుగా ఎం గ్రూప్ కు చెందిన సంజయ్ అరోరాను పరిచయం చేసారని, ఆ తరువాత కూడా కొన్ని సమావేశాల్లో సంజయ్ అరోరాతోనే ప్రభుత్వ ప్రచారం, మీడియా మేనేజ్మెంట్ కు సంబందించిన ప్రెజంటేషన్స్ కూడా ఇప్పించారని వినికిడి.

ఈ విధంగా పరకాలను పక్కన పెడుతున్నారని వాదన చాలావరకు వినిపిస్తోంది. అయితే ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఆయనను ఇప్పటికిప్పుడు బయటకు పంపితే తమ ప్రభుత్వానికే నష్టమని, అదే మరొక విధంగా వేరొకరిని ఆయన స్థానంలో విధులకు తీసుకుంటే ఆయనే అర్ధం చేసుకుని పార్టీనుండి బయటకు వెళ్తారని అనుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ 2014 నుండి టీడీపీ మీడియా సలహాదారుడిగా, తర్వాత ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎంతో చురుగ్గా పాల్గొని పార్టీకి తనవంతు సేవ చేసిన పరకాలను బయటకి పంపడం ఎంతవరకు న్యాయమని కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే పరకాలకు సంబంధించి పార్టీనుండి అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచి చూడవలసిందే…….

  •  
  •  
  •  
  •  

Comments