13 స్థానాల్లో 10 గెలుస్తారట తెలుగు తమ్ముళ్లు ?

Wednesday, November 21st, 2018, 01:18:47 PM IST

మహాకూటమి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ 13 స్థానాల నుండి పోటీలు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ 13 స్థానాలకు గాను కనీసం 9 నుండి 10 స్థానాలను గెలుస్తారట వీళ్ళు. ఈ లెక్కలు ఏదో సర్వే సంస్థ చెబుతున్నవి కావు.. స్వయంగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటూ తిరిగుతున్నవి. కాంగ్రెస్ పార్టీ తినేయగా మిగిలిన స్థానాల నుండి ఏదో మొక్కుబడికి ఈ 13 స్థానాలు దక్కించుకున్న టీడీపీ 10 చోట్ల గెలుస్తామనడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈ 13 స్థానాల్లో సత్తుపల్లిలో సండ్ర వెంటక వీరయ్య గెలుపు ఖాయం అంటున్న టీడీపీ వర్గాలు అశ్వరావుపేటలో మెచ్చ నాగేశ్వరరావు, ఖమ్మంలో నామ నాగేశ్వరరావు, మక్తల్ లో కొత్తకోట దయాకర్ రెడ్డి, మెహబూబ్ నగర్లో ఎర్ర శేఖర్, సనత్ నగర్లో పైన వెంకటేష్ గౌడ్ వంటి వారి గెలుపు తధ్యమని శేరిలింగంపల్లిలో వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్, ఉప్పల్ లో వీరేంద్ర గౌడ్, రాజేంద్ర నగర్లో గణేష్ గుప్తాలు కొంచెం కష్టమైనా గెలుస్తారని, ఇబ్రహీంపట్నం, వరంగల్ వెస్ట్, మలక్ పేట్ నియోజకవర్గాల్లో విజయం మీద పెద్దగా ఆశలు లేవని అంటున్నారు.

మరి తెలుగు తమ్ముళ్లు వేసుకుంటున్న ఈ స్వీయ లెక్కలు ఫలించి నిజంగా వారంటున్నారు ఈసారి ఎన్నికల్లో 10 స్థానాలు గెలుస్తారో లేకపోతే అన్ని లెక్కల్లాగే ఇవి కూడ గాలికిపోతాయో చూడాలి.