సిట్టింగ్ ఎమ్మెల్యే నుండి టీడీపీకి ముప్పు తప్పదా !

Friday, March 15th, 2019, 11:52:43 AM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న 175 స్థానాలకు గాను 126 మందికి టికెట్లు ఖరారు చేసి తొలి జాబితాను ప్రకటించారు. అందులో తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పేరు లేదు. ఆ స్థానాన్ని శ్రీరామ్ మాల్యాద్రికి కేటాయించారు. దీంతో శ్రవణ్ కుమార్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఎన్నికలకు సన్నద్దమవుతున్న తరుణంలో ఇలా సిఎం మొండి చెయ్యి చూపడంతో ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు.

ఎమ్మెల్యేగా తాను చేసిన మంచి పనులు నియోజకవర్గ ప్రజలకు గుర్తున్నాయని, 90 శాతం జనం తనవైపే ఉన్నారని అంటూ, ఈ విషయంపై సిఎంతో మాట్లాడతానని అంటున్నారు. మరోవైపు పార్టీ వర్గాలు ఎమ్మెల్యేకి బదులు బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తారని అంటున్నా శ్రవణ్ ససేమిరా ఒప్పుకోవడం లేదు. తనకు ఎంపీగా పోటీచేసే ఉద్దేశ్యం లేనేలేదని, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు.

అంతేకాదు అసలు టికెట్ కేటాయించిన మాల్యాద్రికి పోటీ చేయడం ఇష్టం లేదంటూ సంచలనం రేపారు. మరి ఆయన మాటల్ని బాబు లెక్కచేసి జాబితాలో మార్పులు చేస్తారో లేకపోతే శ్రవణ్ అసంతృప్తితో రెబల్ అవతారమెత్తుతారో చూడాలి.