సాయం చేసే చేతులను నరికే తత్వం టీడీపీది : పవన్ కళ్యాణ్

Wednesday, May 30th, 2018, 01:29:53 AM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేపట్టిన ప్రజాపోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. కాగా నేడు ఆయన శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలి వద్ద అక్కడ ప్రజలను, ప్రజా సమస్యలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ నేతలకు కానీ చంద్రబాబు గారికి కానీ ప్రజలన్నా, ప్రజా సమస్యలున్నా పట్టదని, వారికి కావలసింది కేవలం ప్రజల ఓట్లు మాత్రమేనని మండిపడ్డారు. ఇక్కడ శ్రీకాకుళంలో అణువిద్యుత్ కేంద్రాలను మాత్రం నెలకొల్పుతారు, వాటిని గుజరాత్ లో నెలకొల్పలేరా అంటూ ప్రశ్నించారు. ఇక్కడి ప్రాంతం అటువంటి అణువిద్యుత్ కర్మాగారాల స్థాపనకు మాత్రం కావాలి అదే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మాత్రం ఇక్కడి ప్రజలకు అవసరం లేదా చెప్పండి చంద్రబాబు గారు అని అడిగారు. ఒకప్పుడు తాను ప్రత్యేక హోదా అనేది సంజీవని అంటే, కాదు కాదు అన్నారు. మరేమో ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు అని అడిగారు. మొదటినుండి ప్రత్యేకహోదా పై ఒకే విధంగా హోదా సాధనకోసం ముందుకు వెళుతూ పోరాడుతోంది కేవలం ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు.

ఓవైపు ఉద్దానం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే ప్రభుత్వం వారు మాత్రం తప్పుడు లెక్కలు, తప్పుడు సమాధానాలు చెపుతూ ఇక్కడి వారికి చేయవలసిన దానికంటే ఎక్కువే చేసాం అంటున్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ప్రజలకోసం అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తే వారికి ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తాయని నిలదీశారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు, అమరావతి భూములను టీడీపీ నేతలు, కార్యకర్తలు చక్కగా పంచుకు తింటున్నారని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరిట అక్రమాలు, అవకతవకలకు ప్రభుత్వం పాల్పడుతోందని, అందువలన వెంటనే ప్రబుత్వం ఆ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జనసేన సైనికులను చక్కగా తమ అవసరాలకు వాడుకుని అధికారం చేజిక్కించుకున్నారని, ఇప్పుడేమో అవసరం తీరింది కనుక వారిపై దాడులు చేస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే సాయం చేసే చేతులను అడ్డంగా నరికి పాతరేసే తత్వం టిడిపిది అని స్పష్టం చేసారు. చంద్రబాబు గారు మీ పార్టీ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని, రానున్న ఎన్నికల్లో మీకు తప్పక బుద్ధి చెపుతారని పవన్ ఎద్దేవా చేశారు……

  •  
  •  
  •  
  •  

Comments