టీడీపీ కి తెలంగాణాలో పట్టిన గతే ఏపీలోను పడుతుంది : జనసేన అధినేత పవన్

Thursday, May 24th, 2018, 03:50:50 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మొన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, నిన్న పలాస లో సాగిన యాత్ర నేడు టెక్కలి నియోజక వర్గం లో జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ఎందరో మహానుభావులు, సైనిక సోదరులు ఈ జిల్లాకు చెందిన వారని పవన్ అన్నారు. కానీ ఇక్కడ సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుగారికి ఇక్కడి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోమని చాలా సార్లు చెప్పినప్పటికీ ఆరోగ్య మంత్రిసహా ఆయన కూడా ఆ విషయాన్ని పూర్తిగా అశ్రద్ధ చేసారని మండిపడ్డారు. విదేశీ డాక్టర్లు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తాం అంటుంటే మన ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీరు మంచి చేయడానికి ముందుకు ఎందుకు రావడం లేదని అన్నారు. అలానే ఇక్కడ పోర్ట్ నిర్మాణం చేపట్టడం వల్ల ఇక్కడ వుండే మత్స్యకారులకు లేనిపోని సమస్యలు వస్తాయని, అందువల్ల పోర్ట్ నిర్మాణం ఇక్కడి ప్రజల అభీష్టం మేరకు జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పై మాట్లాడిన పవన్, పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే బిక్ష కాదని, అది ప్రతి ఉద్యోగి హక్కు అని ఆయన అన్నారు. ఒక ఎమ్యెల్యే, లేదా ఒక ఎంపీ, లేదా ఒక మంత్రి నాలుగు ఐదేళ్లు పని చేస్తే జీవితాంతం వారికి పెన్షన్ ఇస్తారు. అదే ఒక ఉద్యోగి 30 ఏళ్లకుపైగా శ్రమపడి, జీవితాన్ని పణంగా పెట్టి పని చేస్తే అతనికి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత సంకోచిస్తుందో అర్ధం కావడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా సమయంలో ఉద్యమం చేద్దామని అనుకున్నపుడు, చంద్రబాబు ప్రత్యేక ప్యాకెజీ వస్తోంది దానివల్ల రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. చివరికి కేంద్ర పెద్దలను ఇక్కడికి పిలిపించి లక్షలు ఖర్చు పెట్టి సన్మానాలు చేసారు. ప్యాకెజీ అంతవరకు మాత్రమే పరిమితమయింది, అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని అన్నారు. అసలు ఇదంతా చూస్తుంటే తాను గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయినా అని బాధ వేస్తుందని, అందువల్ల ఆ తప్పు ఇకపై చేయనని, తమ పార్టీ రానున్న ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు.

ఇప్పటికే తెలుగు దేశం పార్టీవారు ప్రజలకు అన్యాయం చేసి, ప్రజల సొమ్మును దోపిడీ చేసి దోచుకున్నందువల్ల ఆ పార్టీకి తెలంగాణాలో చెప్పుకోడానికి ఏమి మిగల్లేదని, ఈ విధమైన దోపిడీకి ఇకనైనా అడ్డుకట్ట వేసి ప్రజలకు చేయవలసిన న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో ఏపీలో కూడా అదే గతి పడుతుందని విమర్శించారు. ఇక నిన్న తాను బస చేసిన ప్రాంతంలో స్థానికి టీడీపీ నేతలు కొందరు కుట్రపూరితంగా పవర్ కట్ చేసి తనపై దాడికి ప్రయత్నించారని, ఇటువంటి కుట్రపూరిత దాడులు చేస్తే మేము చూస్తూ వూరుకుంటున్నాం అనుకుంటున్నారేమో, వాటిని ఎలా ఎదుర్కొని తిప్పికొట్టాలో మాకు తెలుసునని గట్టిగా సమాధానమిచ్చారు. మీ దగ్గర రాజకీయ గుండాలు ఉంటే, నా వెనుక జనసేన సైనికులు వున్నారని, న్యాయాన్ని, ధర్మాన్ని అణగదొక్కాలి అనుకుంటే అవి మిమ్మల్నే కాటువేస్తాయి జాగ్రత్త అని టీడీపీని ఉద్దేశించి హెచ్చరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య శాఖా మంత్రి కూడా లేని దుస్థితిలో ఉందని, వెంటనే మంత్రిని నియమించి ఉద్దానం కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే నిరాహార దీక్ష చేస్తానని డిమాండ్ చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments