కంటికి ప్రమాదంగా మారుతున్న టెక్నాలజీ..!

Sunday, September 9th, 2018, 03:00:30 AM IST

మానవుడి దైనందిన జీవితం లో సాంకేతిక పరిజ్ఞ్యానం పెను మార్పులని తీసుకువచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెరుగుతున్న ఈ టెక్నాలజీతో కేవలం తన అర చేతిలో ఈ ప్రపంచాన్ని అంతెందుకు ఈ విశ్వాన్ని చూసేస్తున్నాడు మానవుడు. అయితే మితి మీరిన వాడకం వలన ఈ టెక్నాలజీ కి పరోక్షంగా బానిస అయ్యిపోయాడు మానవుడు, ముఖ్యంగా చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే రోజు గడవటం లేదు. పొద్దున్నే లేచి వారి తల్లి దండ్రులనో లేక తన అరచేతులనో చూసుకునే స్థాయి నుంచి పక్కనే పెట్టుకున్న మొబైల్ ని చూసే స్థితికి వచ్చేసాడు మానవుడు.

ఈ మితి మీరిన మొబైల్ ఫోన్ వాడకం వలన మానవాళి కంటి చూపు మీద చాలా ప్రభావం చూపుతుంది, వాటిని దగ్గరగా పెట్టుకొని చూడటం వలన కంటి లోని రెటీనా దెబ్బ తిని కళ్ళు మసక భారటం లేదా మండటం జరుగుతుంది అంతే కాక రాత్రి పూట ఎక్కువ సమయం అలా చూడటం వలన తక్కువ వెలుగులో ఎక్కువ కాంతి చొచ్చుకుపోవడం వలన కంటి చూపు మందగించే ప్రమాదం ఉంది. గడిచిన ఈ కొద్దీ ఏళ్ళల్లో మొబైల్ ఫోన్ అమ్మకాలతో పాటు కంటి చుక్కల మందు అమ్మకాలు కూడా పెరిగాయ్ అని ఒక సర్వే తేల్చి చెప్పింది. అంతే కాకుండా అలా మొబైల్ ని పట్టుకొని ఉండటం వలన మన మెడ మీద భారం పడి మీద నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని వలన మొబైల్ ఫోన్ వినియోగదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

మొబైల్ లేదా కంప్యూటర్ వాడేటప్పుడు ప్రతి అరగంటకి బ్రేక్ ఇవ్వడమో లేదా రిలాక్స్ అవ్వడమే చెయ్యాలి, ఒకవేళ రాత్రి పూట మొబైల్ ని ఎక్కువగా వినియోగించే వాళ్ళు ఐతే నైట్ మోడ్ ఆన్ చేసి వాడటం మొదలు పెట్టాలి దాని వల్ల కంటి మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుంది, వీలైనంత వరకు తక్కువ కాంతిని మొబైల్ లో సెట్ చేసుకోండి, నైట్ మోడ్ ఆప్షన్ మీ మొబైల్ లో లేకపోతే ప్లే స్టోర్ లో చాలా అప్లికేషన్లు ఉంటాయి అందులో డౌన్ లోడ్ చేసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి.