టీడీపీ లో మళ్లీ మొదలైన కోల్డ్ వార్!

Monday, January 29th, 2018, 09:38:21 AM IST

తెలుగు దేశం పార్టీలో అంతర్గత యుద్దాలు మొదలయ్యాయని మరోసారి రుజువైంది. నెక్స్ట్ ఎలక్షన్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చంద్రబాబు కు ఓ ఐడియా ఉంది. అందుకు తగ్గట్టుగా ఆయన రాజకీయ బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. కానీ తెలంగాణ లో మాత్రం పరిస్థితి ఆయనకు ఏ మాత్రం అనుకూలించడం లేదు. చాలా వరకు ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసమే ఆయన కష్టపడుతున్నారు. అయితే తెలంగాణ లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఆయన ప్రతి నెల నేతలతో చర్యలు జరుపుతున్నారు. కానీ పార్టీలోను ముఖ్య సభ్యులు ఏ స్థాయిలోను చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లుగా వర్క్ చేయడం లేదని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే నాయకులు కూడా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం చూస్తుంటే పార్టీలో విభేదాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది.

రీసెంట్ గా టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీని టీఆరెస్ లో విలీనం చేయాలని చెప్పడం పార్టీలోని నాయకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. పార్టీని బలోపేతం చేయాలని తాము కష్టపడుతుంటే మోత్కుపల్లి ఇలా మాట్లాడటం సరికాదని మరికొందరు టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్యలు కూడా మోత్కుపల్లి వ్యాఖ్యలకు మండిపడ్డారు. 14 ఏళ్లుగా టీడీపీలొనే ఉంటున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైన పార్టీని విడేది లేదని తెలిపారు. అయితే మోత్కుపల్లి స్పందించిన తీరుపై టీడీపీ నేతలు చంద్రబాబుతో చర్చించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా చంద్రబాబుతో తెలుపనున్నారట. మరి ఈ తరహా విషయాలపై చంద్రబాబు ఏ విధమైన ఆలోచనలతో ముందుకు వెళతారో చూడాలి.