తెలంగాణ మ‌హాసంగ్రాం.. ఓటరు తుది తీర్పు నేడే.. మొద‌లైన పోలింగ్‌..!

Friday, December 7th, 2018, 07:32:34 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో నేడు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. మొత్తం 119 శాసనసభ స్థానాల్లో… 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు.

ఇక దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు, వీవీప్యాట్లును అధికారులు తెరిచారు. అన్నీ సవ్యంగా ఉన్న తర్వాతే పోలింగ్ ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

  • 2
  •  
  •  
  •  

Comments