తెలంగాణా బ్రేకింగ్… గద్దర్ సంచలన నిర్ణయం…

Thursday, November 8th, 2018, 05:04:51 PM IST

తెరాస అధినేత సీఎం కె.చంద్రశేఖర్‌రావు గారు పోటీ చేస్తున్న గజ్వెల్ నుంచే తాను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రజా గాయకుడు గద్దర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గద్దర్ విలేకరులతో మాట్లాడుతూ, నేను స్వతంత్ర అభ్యర్థిని, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వారితో జరిగిన భేటీలో 45 నిమిషాల పాటు పాట పాడి వినిపించానని తెలిపారు.ఇంకా రాహుల్‌కు ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌ సేవ్‌ డెమొక్రసీ’ గురించి వివరించానని పేర్కొన్నారు. ఎప్పుడైనా ఫ్యూడలిస్టులు – ఇంపీరియలిస్టులు అనే రెండు వర్గాల మధ్యలోనే ఎన్నికల కొట్లాట ఉంటుందని గద్దర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక ఓటు రాష్ట్ర రాజకీయ నిర్మాణ రూపం కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలందరికి సూచించారు.

ప్రచారంలో భాగంగా మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గ పరిధిలో ఓటుపై చైతన్యం కల్పిస్తామని తెలిపారు. రెండో దశలో ఎస్సీ నియోజకవర్గ పరిధిలో, 3వ దశలో బీసీలు, 4వ దశలో నిరు పేదల దగ్గరకు వెళ్తానని పేర్కొన్నారు. తన మీద దేశంలో ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో స్పష్టంగా తెలియదని గద్దర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా తన మీద చాలా కేసులే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే శాంతి చర్చలు, స్థూపం ఆవిష్కరణ సమయంలో తనపై నమోదైన కేసులను ఎత్తి వేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి చెప్పారని గద్దర్‌ తెలిపారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వ్యాఖ్యానించారు. అయినా భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ఎన్నికలు, రాజ్యాంగం ఎందుకు అని ప్రశ్నించారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి రక్తం చిందించడానికైనా వెనుకాడని వారే చిరస్మరణీయంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో విజయం తథ్యం అనే నమ్మకం తో ఉన్నానని గద్దర్ చెప్పుకొచ్చారు.