కాంగ్రెస్ కొట్లాట‌: సీనియ‌ర్స్ (X) జూనియ‌ర్స్‌

Thursday, September 27th, 2018, 04:00:49 AM IST

కొట్లాట‌ల కాంగ్రెస్‌లో మ‌రోసారి కొట్లాట‌ ముదురుపాకాన ప‌డే స‌న్నివేశం క‌నిపిస్తోంది. `ముంద‌స్తు` పుణ్య‌మా అని.. ఈసారి సీనియ‌ర్లు, జూనియ‌ర్ల మ‌ధ్య కొట్లాట‌ల‌ను ఖాయం చేసుకోవ‌చ్చ‌నేది భోగొట్టా. ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిన సీనియ‌ర్ల సైతం ముంద‌స్తు బ‌రిలో ఎమ్మెల్యేలు అయిపోవాల‌ని, అటుపై వీలుంటే మంత్రులు అయిపోవాల‌ని క‌ల‌లుగ‌న‌డంతో యువ‌కుల ఎమ్మెల్యేగిరీకి చిక్కొచ్చి ప‌డుతోందిట‌. అస‌లింత‌కీ సీనియ‌ర్ల‌లో ఎవ‌రెవ‌రికి ఏఏ ఆశ‌లు ఉన్నాయి? అని ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి.

హైద‌రాబాద్‌- మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఆశిస్తున్నార‌ట‌. అలానే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తానంటూ చెప్పిన అంజన్ కుమార్ తాజాగా వ్యూహం మార్చుకొని సికింద్రాబాద్ – ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక‌డో ఒక చోటి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి మూడేళ్ల పదవి కాలం ఉన్నా.. మునుగోడు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే గిరీకి రెడీ అవుతున్నాడ‌ట‌. రెండు దఫాలుగా కరీంనగర్ ఎంపీగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారిన తెలిసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా ఖమ్మం లేదా పాలేరు త‌న‌కే కావాల‌ని అడుగుతున్నార‌ట‌. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మహబూబాబాద్ సీటుపై కన్నేశారు. అయ్య‌వారికి డోర్నకల్ అయినా ఓకేన‌ట‌. తేరాస నాయ‌కుల‌పై బ‌ల‌మైన అభ్య‌ర్థుల్నే దించాల‌ని భావిస్తున్న అధిష్ఠానానికి వీళ్లంతా మేమున్నాం అంటూ బోర్డ్ పెట్టుకుని మ‌రీ గుర్తు చేస్తార‌ట‌. ఎలానూ గెలిచేస్తామ‌న్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టు మినిస్ట‌ర్ సీనియారిటీ ప్రాతిప‌దిక ఉంటుంది కాబ‌ట్టి అది ఆర్జ‌న‌కు ఉప‌క‌రిస్తుంద‌ని అంతా ఆశిస్తున్నార‌ట‌. వేగంగా సంపాదించుకునేందుకు ఏ ప‌ద‌వి అర్హ‌మో ఆ ప‌ద‌వి మాత్ర‌మే కావ‌లెను. అదీ సంగ‌తి.