ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నికోట్లు దొరికాయి.. కూక‌ట్‌ప‌ల్లిలో జూపూడి ఇంటి వ‌ద్ద ఎంత దొరికింది..?

Thursday, December 6th, 2018, 10:20:01 AM IST

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో రాజ‌కీయ‌పార్టీల ప్ర‌చారం నిన్నిటితో ముగిసింది. ఈ క్ర‌మంలో ఆయా పార్టీలు ప్ర‌లోభాలు మొద‌లుపెట్టారు. పోలింగ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఓట‌ర్లు ఆక‌ట్టుకునేందుకు పార్టీలు ప‌లు రాకాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ లోపాయికారీ ఒప్పందాలు, పంప‌కాలు, ప్ర‌లోభాలకు తెర‌లేపారు అభ్య‌ర్ధులు. ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఇలాంటి ప్ర‌లోభాలు జ‌రుగుతాయ‌ని తెలిసి ఈసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్ప‌టి నుండే ఫోక‌స్ పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌తో పాటు, అన్ని జాతీయ‌ర‌హ‌దారులు పైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా ప‌ట్ట‌ణ‌, మండ‌ల‌, గ్రామాల్లో త‌నిఖీ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పోలీసులతోపాటు ఐటీ, ఎక్సైజ్, ఎన్నికల ప్రత్యేక బృందాలు.. అక్రమంగా రవాణా అవుతున్న నగదు, నగలు స్వాధీనం చేసుకుంటూ, ఎన్నిక‌ల కోసం ఖ‌ర్చు చేసేందుకు త‌ర‌లిస్తున్న డ‌బ్బును ఎక్క‌డిక‌క్క‌డ అండ్డుకుంటున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం నాటికి దాదాపు 120 కోట్లు న‌గ‌దుతో పాటు మ‌ధ్యం, ఇత‌ర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నార‌ని స‌మాచారం.

ఇక తాజాగా బుధ‌వారం రాత్రి ఏపీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ జూపూడి ప్ర‌భాకర్‌రావు నివాసం వ‌ద్ద పెద్ద ఎత్తున న‌గ‌దు ల‌భించ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కూక‌ట్‌ప‌ల్లిలో టీడీపీ అభ్య‌ర్ధి సుహాసిని విజ‌యం కోసం శ్ర‌మిస్తున్న జూపూడి ద‌గ్గ‌ర‌కి బుధ‌వారం రాత్రి ముగ్గురు యువ‌కులు డ‌బ్బుమూట‌ల‌తో వ‌చ్చార‌ని.. దీంతో జూపూడి వాహ‌నం గ‌మ‌నించిన టీఆర్ఎస్ నేతలు పోలీసుల‌కు ఫిర్యాదు ఇవ్వ‌డంతో పోలీసులు రాగా ఇద్ద‌రు యువ‌కులు పారిపోయార‌ని, ఒక వ్య‌క్తి ప‌ట్టుబ‌డ్డాడ‌ని తెలుస్తోంది. ఇక అక్క‌డే వ‌దిలేసిన బ్యాగుల్లో దాదాపు 15 నుండి 20 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌గ‌దు ఉన్న‌ట్టు గుర్తించిన పోలీసులు ఆ న‌గ‌దును సీజ్ చేశారు. దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.