న‌వంబ‌ర్‌లో ఎల‌క్ష‌న్‌.. ఇదిగో ఇదే ప్రూఫ్‌!!

Friday, September 28th, 2018, 02:46:59 PM IST

తెలంగాణ ఎన్నిక‌లు ఈ ఏడాదిలోనా? లేదూ 2019లోనా? ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయంటూ మీడియా చానెళ్లు ఊద‌ర‌గొట్టేస్తున్నాయి. దీనిపై ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి క్లారిటీని ఇవ్వ‌లేదు. ఫ‌లానా తేదీన లేదా ఫ‌లానా నెల‌లో ఉంటాయ‌న్న మాట అయితే లేదు. అయితే ప్ర‌స్తుతం ఎన్నిక‌లొస్తే జిల్లా స్థాయిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప‌రిక‌రాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయా.. త‌దిత‌ర విష‌యాల్ని ఈసీ సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తోంది.

ఆ క్ర‌మంలోనే ఈసీ పొర‌పాటునో, లేక యాథృచ్ఛికంగానో లేదా య‌థాలాపంగానో ఓ ఫ్లెక్సీని ప్ర‌ద‌ర్శించి పెద్ద అగ్గి రాజేసింది. `ఇనాగురేష‌న్ ఆఫ్ స్టేట్ మీడియా సెంట‌ర్ ఫ‌ర్ స్టేట్ ఎల‌క్ష‌న్స్ -2018 ఆన్ 27.09.2018, డి-బ్లాక్, సెక్ర‌టేరియ‌ట్‌-డా.ర‌జ‌త్ కుమార్, ఐఏఎస్‌“ అంటూ ఫ్లెక్సీని ప్ర‌ద‌ర్శించింది ఈసీ. ఈ ఫ్లెక్సీ మీనింగ్.. 2018లోనే తెలంగాణ ఎన్నిక‌లు అని ధృవీక‌రించేసింది. అంటే 2018 న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు ఖాయం అని జేగంట‌ మోగించింది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే… ఎన్నికలు 2018లోనే అని అధికారికంగా ఫ్లెక్సీ తో ప్రకటించేసింది ఈసీ. ప్ర‌స్తుతం ఈ ఫ్లెక్సీ అన్ని పార్టీల వాట్సాప్ గ్రూపుల్లోకి జోరుగా వెళ్లిపోతోంది. ఒక‌వేళ న‌వంబ‌ర్‌లోనే ఎన్నిక‌లు నిజ‌మే అనుకుంటే తేరాస గెలుపును కూడా ఖాయం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థులెవ‌రూ ఇంత‌వ‌ర‌కూ ఏబీసీడీలు కూడా పూర్తి చేయ‌లేదు ప్ర‌చారంలో. మ‌రోవైపు గులాబీ అధినేత‌లు న‌గ‌రాలు, గ్రామాలు అనే తేడా లేకుండా తెలంగాణ‌ను సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌తో చుట్టేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌, క‌విత‌, హ‌రీష్ ఉరుకులు ప‌రుగుల మీద ఉన్నారు. మంత్రుల్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇప్ప‌టికే గులాబీ పార్టీ త‌ర‌పున‌ 105 మంది అభ్య‌ర్థుల్ని ప్రక‌టించేసి మ‌రో 14 మంది అభ్య‌ర్థుల‌పైనా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. ఈ స్పీడ్ చూస్తుంటే గులాబీ బాస్‌కి ప‌క్కాగా కేంద్రం నుంచి ఎన్నిక‌ల‌పై స‌మాచారం ఉంద‌ని అనుకోవ‌చ్చు.