ఎన్నిక‌ల కోడ్ కూసే వేళ ఇదీ…!!

Saturday, September 29th, 2018, 12:02:51 AM IST

ఎట్ట‌కేల‌కు ఎన్నిక‌ల‌కు స‌ర్వ‌స‌న్నాహ‌కం మొద‌లైంది. న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు ఖాయ‌మ‌న్న మాట తెలంగాణ వ్యాప్తంగా నాయ‌కుల్లో వినిపిస్తోంది. ఆ మేర‌కు అన్ని ఏర్పాట్ల‌ను ఎన్నిక‌ల క‌మీష‌న్ ప‌ర్య‌వేక్షిస్తోంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి ర‌జ‌త్ కుమార్ ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే అన్ని పార్టీల్ని కోడ్ ప‌రిధిలోకి తెచ్చారు. అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం నిధుల్ని దుర్వినియోగం చేయ‌కూడ‌ద‌న్న క్లారిటీని ఆయ‌న ఇచ్చారు.

తాజా తాజా స‌మాచారం ప్ర‌కారం.. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఉమేష్ సిన్హా కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింద‌ని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి శుక్రవారం సాధారణంగా ఎన్నికల ప్రక్రియపై జరిగే సమావేశం శుక్ర‌వారం సాయంత్రం గంటన్నర పాటు జరిగింది. ఉమేష్ సిన్హా తెలంగాణలో పర్యటించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన రిపోర్ట్ ను ఇక్క‌డ స‌మీక్షించారు. ఆ క్ర‌మంలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిపేందుకు సీఈసీ సమాయత్తం అవుతోందని తేలింది. తెలంగాణలోని రాజకీయ పార్టీలు లేవనెత్తిన సంశ‌యాలు, సందేహాల‌ను ఉమేష్ సిన్హా కమిటీ తోసిపుచ్చింది. అన్నీ ప‌రిశీలించాక‌.. ఉమేష్ సిన్హా కమిటీ తెలంగాణ‌లో ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని రిపోర్ట్ సీఈసీకి అందజేసింది. అక్టోబర్ రెండో వారంలో నాలుగు రాష్ట్రాలతో పాటు, లేదంటే తెలంగాణకు వేరుగా ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎన్నిక‌లా? లేక తెలంగాణకు ప్రత్యేకంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలా? అనే అంశంపై ఈసీ సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తోంది. నాలుగు రాష్ట్రాలతో పాటు కలిపి ఉండొచ్చు. లేదూ వేరుగా తెలంగాణ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ చేసేందుకు సిద్ధం చేసే అవ‌కాశం ఉంద‌ని మెజారిటీ అధికారుల‌ అభిప్రాయం వినిపిస్తోంది.