అంతా అస్తవ్యస్తమే.. గందరగోళమే..!

Thursday, October 16th, 2014, 09:44:28 PM IST

Reshan
తెలంగాణలో ఆహారభద్రత కార్డులు, సామాజిక ఫించన్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. దరఖాస్తులు స్వీకరించే కేంద్రాల దగ్గర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల తొక్కిసలాటలు జరుగుతుండటంతో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరోవైపు ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

కొత్త రేషన్ కార్డులు, ఫించన్ల కోసం తెలంగాణ పది జిల్లాల్లో ఆయా కేంద్రాల దగ్గర జనం బారులు తీరుతున్నారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, వికలాంగుల తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. ప్రస్తుత లబ్ధిదారులు, కొత్త వారు అందరూ దరఖాస్తు చేసుకోవాల్సి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు కేంద్రాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఆధార్ కేంద్రాలు, సదరం శిబిరాల వద్ద గంటలు గంటలు నిలబడలేక వృద్ధులు, వికలాంగులు సొమ్మసిల్లిపోతున్నారు.

హైదరాబాద్.. సైదాబాద్ మండల కార్యాలయంలో ఫించన్ కోసం క్యూ లైన్ లో నిలబడ్డ వృద్ధుడు అంజాద్ ఖాన్ కుప్పకూలి మృతిచెందిన ఘటన మర్చిపోకముందే.. మరో వృద్ధుడు విగతజీవిగా మారాడు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిభిరం దగ్గర తోపులాట జరగడంతో మరో వృద్దుడు చనిపోయాడు. మృతుడ్ని ఖిల్లా ఘనపురం మండలం బలిజపల్లికి చెందిన 62 ఏళ్ల నర్శింహారెడ్డిగా గుర్తించారు.

మరోవైపు వితంతు పింఛన్ల కోసం భర్త మరణ ధ్రువీకరణపత్రం కోసం మహిళలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. అలాగే ఫాస్ట్ పథకంలో లబ్ధి పొందాలంటే తహసీల్దార్లు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు అవసరమనడంతో విద్యార్థులు కూడా బారులు తీరుతున్నారు. స్వీకరించిన దరఖాస్తుకు విధిగా ప్రత్యేక సంఖ్యతో రశీదు ఇవ్వాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీటి వూసే లేదు. పలుచోట్ల దరఖాస్తులను కుప్పలుగా పడేస్తున్నారు. ప్రజాసౌకర్యాన్ని విస్మరించి నాయకులకు అనుకూలమైన ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఆహారభద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుకు ఆధార్ తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందికి ఆధార్ కార్డుల్లేవని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఆధార్ నమోదు కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. కనీస వసతుల్లేక చంటిపిల్లలతో వచ్చినవారు గగ్గోలుపెడుతున్నారు. కొన్నిచోట్ల ఒత్తిడి తట్టుకోలేక, మరికొన్ని చోట్ల విద్యుత్తుకోతలతో ఆధార్ కేంద్రాలను మూసేసి వెళ్లిపోతున్నారు. డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు బోగస్ ఆధార్ కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి.

కులధ్రువీకరణ, ఆదాయ, స్థిర నివాస దరఖాస్తులు పింఛను అప్లికేషన్లను ఒకే చోట తీసుకుంటుండటంతో కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక… ఆహారభద్రత కార్డులకు చౌకదుకాణాల్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. దుకాణదారులు వేళలు పాటించకపోవడంతో అక్కడ కూడా నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరో ఐదురోజులు గడువు పొడిగించింది. దరఖాస్తు విధానాన్ని సౌకర్యవంతం చేయాలని, కేంద్రాలవద్ద తగినంత సిబ్బందిని నియమించాలని, కనీస వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.