ఐఏఎస్‌ల శాపం కేసీఆర్‌కి ఖాయం…

Saturday, November 3rd, 2018, 01:11:30 PM IST

అయిన వారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నాడ‌ట వెన‌క‌టికి ఒక‌డు..ఇది తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రికి క‌రెక్ట్ గా వ‌ర్తిస్తుందట‌. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఉన్నాయ‌ని చెప్పిన కేసీఆర్ మాట‌లు నీటిమూట‌లుగా మారాయ‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తొలి తెలంగాణ ప్ర‌భుత్వంలో ఐఏఎస్‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని, ఇక్క‌డి వారికి కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌కుండా అవ‌మానిస్తున్నార‌ని గ‌త కొంత కాలంగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌కు చెందిన ఆల్ ఇండియా స‌ర్వీస్ క్యాడ‌ర్ స్థాయి అధికారుల‌ను వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని, చిన్న‌చూపు కార‌ణంగానే తెలంగాణ‌కు చెందిన 21 మంది ఐఏఎస్‌ల‌కు మొండిచేయి చూపించార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఇక్క‌డి వారిని కాద‌ని ఉత్త‌రాది వారిని అంద‌లం ఎక్కిస్తుండ‌టం ఇక్క‌డి అధికారుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంద‌ని వినిపిస్తోంది. సీఎస్‌గా సేవ‌లందించిన‌ ప్ర‌దీప్ చంద్ర ప‌ద‌వీకాలాన్ని పొడిగించ‌కుండా ఆయ‌న‌ను అవ‌మానించార‌ని, మిగ‌తా వారిని కూడా ఇదే త‌ర‌హాలో పోస్టింగ్ ఇచ్చినా ఎలాంటి ప్ర‌ధాన్య‌త లేని శాఖ‌ల్ని వారికి కేటాయించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై తెలంగాణ‌కు చెందిన ఐఏఎస్‌లు కేసీఆర్ ప్ర‌భుత్వ వింత స్ట్రాట‌జీపై గుర్రుగానే వున్నార‌ట‌. సొంత రాష్ట్రానికి చెందిన వారిని అవ‌మానిస్తూ కానివారిని అంద‌లం ఎక్కిస్తున్నార‌ని, ఇది ఇలాగే కొన‌సాగితే బంగారు తెలంగాణ మాట దేవుడెరుగు అని ఐఏఎస్‌లు వాపోతున్నారు. ఐఏఎస్‌ల శాపం కేసీఆర్‌కి త‌ప్ప‌ద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.