సెన్సేషనల్ న్యూస్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. నీకు దమ్ముందా?: మంత్రి కేటీఆర్ సవాల్

Friday, April 6th, 2018, 12:55:10 PM IST

2019లో టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని.. కాంగ్రెస్ ఓడిపోతే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు మిర్యాలగూడ జనహితప్రగతిసభ వేదికగా జబ్బ చరిచి సవాలు విసిరారు. ఈ సవాలుకు సిద్ధపడకపోతే కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయన ఒప్పుకున్నట్టు భావించాల్సి వస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్ గెలువకపోతే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధం. ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. నీకు దమ్ముందా? ముందుకురా. నా సవాలును స్వీకరించేందుకు నువ్వు సిద్ధమా..? కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఉత్తమ్, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన జిల్లాలోనే సవాలుచేస్తున్నా అని పేర్కొన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో కలిసి రూ.98 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం ఎన్నెస్పీ క్యాంపులో నిర్వహించిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్‌కు 80 నుంచి 90 సీట్లొస్తాయని కోతలు కోస్తున్న ఆ పార్టీ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.

గతంలో రెండుసార్లు అధికారమిస్తే.. ప్రజలకు ఏం చేసారని ఇప్పుడు బస్సుయాత్ర పేరుతో మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. తమ హయాంలో రైతులకు ఆరుగంటల కరంటు, విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులు.. ఓట్లు అడగడం కోసం ఇప్పుడు నానాతంటాలు పడుతున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ ఇస్తే ఎలా పరిపాలిస్తారు? మీకు తెలివి ఉందా? అన్న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కనుమరుగయ్యాడని చెప్పారు. సొంతజిల్లాను అభివృద్ధిచేయలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి మంత్రులుగా పనిచేసి ఫ్లోరోసిస్ బాధితులకు మంచినీరు అందించలేని దౌర్భాగ్యస్థితిలో పదవులను అనుభవించారని విమర్శించారు. పొరపాటుగా సైతం వారి మొసలి కన్నీరును పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను గులాబీకొండగా మార్చి రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉంచాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల కష్టాలు తీర్చడం కోసం ఇంటింటికి మంచినీరు అందించకపోతే మళ్లీ ఓటు అడిగేదిలేదన్న గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.