తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ తప్పిదం వల్లే ఘటన!

Tuesday, September 11th, 2018, 01:12:51 PM IST

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 20 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది. చాలా మంది స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించి అధికారులకు సమాచారమందించారు.
ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వేములవాడ డిపో మేనేజర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతూ,, బస్సు కండిషన్ లోనే ఉందని డ్రైవర్ తప్పిదం కారణంగా ప్రమాదం జరగవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా ఘాట్ రోడ్డుపై సైన్ బోర్డులు ఉన్నప్పటికీ ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇక బస్సులో ఎక్కువ శాతం స్థానికులే ఉన్నారని తెలుస్తోంది. ఘటనపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్ గాయపడిన వారిని మెరుగైన చిక్కిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments