‘తెలంగాణ జన సమితి’ మ్యానిఫెస్టో ఇదే!

Sunday, April 29th, 2018, 10:57:14 PM IST

తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదని బంగారు తెలంగాణ అవసరం లేదని, భౌగోళిక తెలంగాణ కావాలని ప్రజలకు అవసరమైన సుభిక్షమైన తెలంగాణ కావాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాయకులు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ డిమాండ్ చేయ‌డం చూస్తుంటే రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపున‌కు ఆయ‌న శ్రీ‌కారం చుడుతున్నారా? అనిపించ‌క మాన‌దు. తెలంగాణ నిర్మాణానికి మనం అందరం కలిసి సాగుదామని, సామాజిక తెలంగాణాను నిర్మింపజేసుకుందామని ఆయన ఈ సంధర్భంగా ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో సరూర్‌నగర్ వేదికగా టీజేఎస్ సభావేదిక ఏర్పాట్లను ప‌రిశీలిస్తూ ఆయ‌న అన్న మాట‌లు జ‌నాల్లో ప్ర‌కంప‌నాలే సృష్టిస్తున్నాయి.

జనం కోసమే తెలంగాణ జన సమితి ఏర్పడిందన్నారు. ప్రజలకు మ్యానిఫెస్టోలో భాగస్వామ్యం కల్పిస్తామని కోదండ అన్నారు. తెలంగాణ రాజకీయాలలో మార్పుకు మేం అంతా సిద్దం అనే సంకేతం ఇవ్వడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను ఆవిర్భావ సభకు వచ్చి విజయవంతం చేసే దిశగా ప్రజలను కోరుతున్నామని కోదండరామ్ తెలిపారు. రాజకీయాలలో కానీ, ఆర్థిక రంగంలో కానీ ప్రజలు కేంద్రంగా ఉండాలన్నారు. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని దాదాపు నెలరోజులు దాటిందని ఈ కాలంలో మేం చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చామన్నారు. గ్రామాలలో, పట్టణాల్లో, బస్తీలలో ఆవిర్భావ సభ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశామని తెలిపారు. ఈ సభకు ప్రజలు తప్పకుండా రావాలని, విజయవంతం చేయాలని ప్రజలను మేం ఈ సంధర్భంగా కోరుతున్నామని చెప్పారు. ఆవిర్భావ సభ ఎలా జరగాలనే దానిపై ఒక నిర్వహణ కమిటీని వేశామని.. వేదిక నిర్మాణానికి కూడా ప్రణాళికా బద్దంగా ఆలోచన చేసి చాలా చర్చించామని తెలిపారు. మొత్తం మీద ఒక వేదికను తయారు చేసుకొన్నాం. ఈ వేదిక ద్వారా మేం మొత్తం తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో చెప్పదల్చుకున్నామని తెలిపారు. ఈ వేదిక మీద అమరుల కుటుంబాలకు తగిన ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమరుల త్యాగాలను విస్మరించిందన్నారు. భూ నిర్వాసితులు, నేరెళ్ల బాధితులు, ఆత్మహత్యలు సుకున్న రైతుల కుటుంబాలు, ఉద్యోగాలు రాక మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు ఇలా ఎందరినో ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

ఈ సభ ద్వారా నేరెళ్ల బాధితులు, రైతుల కుటుంబాలు, ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగ కుటుంబాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. వేదికపై వారిని కూర్చొనే విధంగా వేదికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమస్యలు మమ్మల్ని కదిలించాయని, పురిగొల్పాయని చెప్పారు. వాటినుంచి బయటపడడానికి సంఘటితంగా ప్రయత్నం చేస్తున్నామని వేదిక ద్వారా చెప్పదలిచామని తెలియజేశారు. ఉద్యమకారుల ఆకాంక్షల సాధన కోసం అందరం కలిసి నిలబడి ప్రయత్నం చేద్దామని, రేపు జరుగబోయే ఆవిర్భావ సభ ద్వారా వారి ఆశయాలను నెరవేర్చే దిశగా సాగుదామని కోదండరామ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కళాకారులు వస్తున్నారని.. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా నృత్యరూప ప్రదర్శనలు, పాటలు ఉంటాయని తెలిపారు. ఆవిర్భావ సభలో చేరికలు ఉండవని కోదండరామ్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ ప్రకటనను గురించి మాత్రమే సభలో మ‌రిన్ని ఫైరింగ్ బుల్లెట్స్‌ని కోదండ దాచుకున్నార‌ట‌. ఈ ప్రసంగంలో ప్ర‌తి మాటా పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న‌వేన‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.