150 ఎక‌రాల్లో తెలంగాణ కొత్త స‌చివాల‌యం

Tuesday, February 12th, 2019, 09:32:39 AM IST

తెలంగాణ‌కు కొత్త స‌చివాల‌యం ఐదేళ్లుగా న‌లుగుతున్న హాట్ టాపిక్ ఇది. మ‌రోసారి దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రెండ‌వ ద‌ఫా ప‌ద‌విని చేప‌ట్టిన కేసీఆర్ రెండు నెల‌ల‌వుతున్నా స‌చివాల‌యం ముఖం చూడ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి ఓవైపు. కుప్ప‌లు కుప్ప‌లు ఫైళ్లు పోగ‌వుతున్నా అదేమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాంటి ముఖ్య‌మంత్రికి కొత్త స‌చివాల‌యం అవ‌స‌ర‌మా? అని ప‌లు ప్ర‌జా సంఘాలు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. వాణిజ్య‌ప‌ర‌మైన కార‌ణాల‌తోనే కొత్త స‌చివాల‌య నిర్మాణం కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని మండిప‌డుతున్నారు.

సోష‌లిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, బైస‌న్ పోలో, జింఖానా మైదానం ప‌రిర‌క్ష‌ణ క‌మిటి, తెలంగాణ జాయింట్ యాక్ష‌న్ క‌మిటి ఆధ్వ‌ర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సోష‌లిస్టు పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లుబ్నా స‌ర్వ‌త్ తెరాస ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. బైస‌న్ పోలో గ్రౌండ్ 60 ఎక‌రాలు, ర‌క్ష‌ణ శాఖ భూమి 90 ఎక‌రాలు మొత్తం క‌లిపి 150 ఎక‌రాలు. ఈ భూమిని కేటాయించ‌డానికి కేంద్రం 9 ష‌ర‌తులు విధించింది. ఆ ష‌ర‌తులు అంగీక‌రించ‌డం వ‌ల్ల‌నే ఈ భూముల్ని తెలంగాణ కొత్త స‌చివాల‌యానికి కేటాయించింది. ర‌క్ష‌ణ శాఖ అవ్రూవ్ చేసిన త‌రువాతే కేంద్రం ఈ భూముల్ని కేటాయించిన‌ట్లు సోష‌లిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, బైస‌న్ పోలో, జింఖానా మైదానం ప‌రిర‌క్ష‌ణ క‌మిటి, తెలంగాణ జాయింట్ యాక్ష‌న్ క‌మిటి వెల్ల‌డించింది.