కారెక్కుతున్న నామా నాగేశ్వ‌ర్‌రావు!

Wednesday, March 20th, 2019, 11:15:07 AM IST

తెలంగాణ‌లో టీడీపీ దుకాణం బంద్ అయింది. గ‌త ఎన్నిక‌ల్లో చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయినట్టుగా టీడీపికి తెలంగాణ‌లో ఖ‌మ్మం మిన‌హా ఒక్క‌సీటు ద‌క్క‌లేదు. ద‌క్కిన వారు కూడా ఇటీవ‌ల తెరాస చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు లొంగి తెరాస గూటికి చేరిపోయారు. ఇక మిగిలి వున్న కొంత మంది సీనియర్ నేత‌లు కూడా తలోదారి చూసుకుంటున్నారు. ఖ‌మ్మంలో మాత్రంమే మిగిలి వున్న టీడీపీ క్యాడ‌ర్ తెరాస‌లోకి వెళుతుండ‌టంతో తెలంగాణ‌లో టీడీపీ దుకాణం సంపూర్ణంగా మూత‌ప‌డిన‌ట్టే అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఏప్రిల్‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వ‌ర‌రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో తెలంగాణలో టీడీపీ నామ‌రూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోతోంది. గ‌త కొంత కాలంగా తెరాస అధినాయ‌క‌త్వంతో ట‌చ్‌లో వున్న నామా నాగేశ్వ‌ర‌రావు మంగ‌ళ‌వారం టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వానికి, నొలిట్ బ్యూరో ప‌ద‌వికి నామా రాజీనామా చేయ‌డం టీడీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వ‌ర‌రార‌వు త్వ‌ర‌లో తెరాస‌లో చేరుతున్న‌ట్లు స‌మాచారం. ఖ‌మ్మం లోక్ స‌భ స్థానం నుంచి తెరాస అభ్య‌ర్థిగా నామా పోటీ చేసే అవ‌కాశం వుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.