సీఎం కేసీఆర్‌పై నిరుద్యోగులు గ‌రంగ‌రమ్‌!!

Sunday, October 29th, 2017, 03:53:49 AM IST

ఉద్యోగాల క‌ల్ప‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ద్వంద్వ వైఖ‌రిపై నిరుద్యోగులు గ‌రంగ‌రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో నిరుద్యోగుల్లో అస‌హ‌నం అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేష‌న్ ప‌లు వివాదాల‌కు తావిచ్చింది. ఈసారి కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌గా ఖాళీల్ని పూరించేలా నోటిఫికేష‌న్‌లో పేర్కొన‌డం నిరుద్యోగుల్లో భ‌యాందోళ‌న‌కు కార‌ణ‌మైంది. పాత జిల్లాల ప్రాతిప‌దిక‌గానే నోటిఫికేష‌న్ వేయాలంటూ విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. ప్ర‌స్తుతం కోర్టులో కేసుల‌తో ఈ రిక్రూట్‌మెంట్ పెండింగ్‌లో ప‌డిన‌ట్టేన‌ని నిరుద్యోగులంతా బేల‌త‌నం చూపిస్తున్నారు. ఏళ్ల‌కు ఏళ్లు కోచింగులు తీసుకుంటున్న వాళ్లంతా పూర్తిగా నిరాశ‌నిస్పృహ‌ల్లోకి వెళ్లిపోయారు.

లేక లేక ఒక నోటిఫికేష‌న్ వేయ‌డం.. దానిపైనా వివాదాలు రాజుకుపోవ‌డం ఇదంతా.. ద్వంద్వ వైఖ‌రికి నిద‌ర్శ‌నం అన్న వాద‌న విద్యార్థుల్లో వినిపిస్తోంది. ఉన్న అవ‌కాశం కూడా నీరుగారిపోయిందే అన్న వ్య‌థ‌లో టీచ‌ర్ ఉద్యోగార్థుల్లో నెల‌కొంది. నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం.. దానిపై కేసులు వేయ‌డం.. ఇదంతా రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ద్వంద్వ వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని నిరుద్యోగులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలోనూ గురుకుల్‌ టీచర్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. విద్యార్హ‌త‌ల విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొన‌డం పెనువివాదానికి దారి తీసింది. కార‌ణం ఏదైనా తెలంగాణ‌లో టీచ‌ర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ముక్కుతూ మూలుగుతూ మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌.. సామెత‌ను త‌ల‌పిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వోద్యోగం కోసం కోచింగ్ సెంట‌ర్ల‌కు వేలు, ల‌క్ష‌ల్లో వెచ్చిస్తున్న నిరుద్యోగుల‌కు ఏడుపు ఒక్క‌టే త‌క్కువ‌. ఈ ప‌రిణామం చూస్తుంటే నిరుద్యోగుల్లో అస‌హ‌నం తారా స్థాయికి చేరుతోంద‌ని దిల్‌షుక్ న‌గ‌ర్ కోచింగ్ సెంట‌ర్ నిర్వాహ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే నిరాశ‌లో ఉన్న ఉద్యోగార్థులంతా జేఏసీలుగా ఏర్ప‌డి ఐక్య‌పోరాటానికి రెడీ అవుతున్నారు. ఇది ఉద్య‌మ‌రూపం తీసుకునే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఆంధ్రా పాల‌కుల అరాచకాల్ని మించి కేసీఆర్ ప్ర‌భుత్వ అరాచ‌కాలు సాగుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేవ‌లం కొన్ని రోజుల్లో అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతోంది. న్యాయపరంగా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని డీఎస్సీ వేశామని ప్ర‌భుత్వం చెబుతున్నా .. ఇదేదీ విశ్వ‌సించే ప‌రిస్థితి నిరుద్యోగుల్లో లేనేలేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌వుతున్న వేళ నిరుద్యోగ వ‌ర్గం కేసీఆర్ ప్ర‌భ‌త్వం క‌సి తీర్చుకునే వైనం క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎల‌క్ష‌న్ ముందు కేసీఆర్ ఇంకేదైనా ప్లాన్ వేస్తారా? ఒక‌వేళ వేస్తే దానిని నిరుద్యోగులు న‌మ్ముతారా? అంటూ కూడా విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments