తెలుగు రాష్ర్టాలకు హైటెక్ సొగసులు

Friday, September 12th, 2014, 11:45:18 PM IST


తెలుగు రాష్ర్టాలు హైటెక్ సొగసులతో తళుక్కున మెరవబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో తొమ్మిది స్మార్ట్ సిటీలు కొలువుతీరనున్నాయి.తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలు రానుండగా, ఏపీలో నాలుగు స్మార్ట్ సిటీలను కేంద్రం అభివృద్ధి చేయనుంది. స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాలకు మౌలిక వసతులపై కేంద్రం భారీగా వెచ్చించనుంది

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న వంద స్మార్ట్ సిటీల్లో దాదాపు తొమ్మిది స్మార్ట్ సిటీలు తెలంగాణ, ఏపీల్లోనే కొలువుతీరనున్నాయి. దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేసి, అభివృద్ధి చేస్తామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు బడ్జెట్‌లో రూ.7వేల60 కోట్లను కేటాయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖమంత్రి వెంకయ్యనాయుడుతోపాటు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలను వారి ముందు ఉంచిన ముఖ్యమంత్రి… స్మార్ట్ సిటీలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కేంద్రం వంద నగరాల ఎంపికలో భాగంగా తొలి విడతగా తెలంగాణ రాష్ట్రంలోని ఐదు నగరాలను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేసింది.

హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండలకు స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కినట్లు సమాచారం. స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాలకు మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు రానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం పట్టుదలతో ఉన్నారు. బాబు ఈ విషయమై పలు సార్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీలతో తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర నిధులతోవిజయవాడ, గుంటూరు, తిరుపతి, చిత్తూరులను స్మార్ట్ సిటీలుగా డెవలప్ చేయనున్నారు.