షాకింగ్ న్యూస్ : తెలుగు మహిళా అధ్యక్షురాలు దారుణ హత్య

Wednesday, March 14th, 2018, 12:20:15 AM IST

నేటి కాలంలో హత్యోదంతాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. హత్యలు జరిగాక వాటిని తెలివిగా ఛేదించి నిందితులను పట్టుకోవడం పోలీస్ లకు పెను సవాలుగా మారుతోంది. తెలంగాణ లోని కొత్తపల్లి లో నిన్న జరిగిన హత్య ఆ ప్రాంత వాసులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. విషయం లోకి వెళితే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు రామిళ్ళ కవితకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు పదిహేనేళ్లు కాగా, మరొకరు పద్నాలుగేళ్లు. పదేళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఆమె కుమార్తెల తో కలిసి వారిని చదివించుకుంటూ జీవిస్తున్నారు. అయితే నిన్న బంధువుల ఇంట్లో జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మంథని వెళ్లారు. అక్కడ ఫంక్షన్ పూర్తి అయ్యాక ఆమె తన చిన్నకుమార్తెను విడిచి, పెద్ద కుమార్తెతో కలిసి ఇంటికి బయలుదేరారు.

అర్థరాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కవితపై దాడికి యత్నించారు. ఈ సమయంలో తల్లిని కాపాడేందుకు పెద్ద కుమార్తె ప్రయత్నించింది. దీంతో దుండగులు ఆ అమ్మాయి చేతులు, కాళ్లు కట్టేసి మరో గదిలో బంధించారు. అనంతరం ఆమె చూస్తుండగానే కవిత తలపై కత్తిపీటతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆమె మీద ఉన్న నగలు, ఇంట్లోని వెండి సామాన్లు, నగదు తీసుకొని పారిపోయారు. ఈ హత్యకు కారణం ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను హత్య చేసింది డబ్బు కోసమా లేక ఇంకేమైనా ఇతర కక్షలు నేపథ్యంలో హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. కాగా కొత్తపల్లి లోని ఆమె ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి…

  •  
  •  
  •  
  •  

Comments