2019 బిగ్‌వార్ : పట్టువ‌ద‌ల‌ని జ‌గ‌న్.. వైసీపీలోకి మ‌రో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు..?

Saturday, February 16th, 2019, 01:05:53 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ ఊహించ‌ని రీతిలో దూసుకుపోతుంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు త‌క్కువ స‌మ‌యం ఉండ‌డంతో వ‌రుస‌గా ఇత‌ర పార్టీ నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతుండ‌డంతో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏం చేయాలో కూడా పాలుపోవ‌డంలేదు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఏముహుర్తాన టీడీపీ అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు ఏ ముహుర్తాన వైసీపీలో చేరారో కానీ, ఉత్త‌రాంధ్ర‌లో క‌ల‌క‌ల రేపింది. ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు జిల్లావ్యాప్తంగా ఉన్న‌ మంచి పలుకుబడితో పాటు అర్ధ‌బ‌లం, అంగ‌బ‌లం, వైసీపీకి ఎంతో మేలు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. దీంతో పార్టీని మ‌రింత ప‌టిష్టం చేసే బాధ్య‌త‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు మ‌రో ముగ్గ‌రు ఎమ్మెల్యేల‌ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు స్టార్ట్ చేశార‌ని తెలుస్తోంది.

వారిలో ముఖ్యంగా ముత్తంశెట్టి ప్ర‌జారాజ్యం బ్యాచ్‌మేట్ అయిన య‌ల‌మంచిలి ఎమ్మెల్యే పంచ‌క‌ర్లు ర‌మేష్‌బాబు ఒక‌రు కాగా, గాజువాక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్. ఈయ‌న కూడా ప్ర‌జారాజ్యం నుండి వ‌చ్చిన నేత కావ‌డం గ‌మ‌నార్హం. ఇక మ‌రో సెన్షేష‌న్ నేత ఎవ‌రంటే.. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను కూడా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ముత్తంశెట్టి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ముగ్గ‌రుకీ ఇప్ప‌టికే టీడీపీలో పొగ‌పెడుతున్నార‌ని తెలుస్తోంది.

దీంతో ఇప్ప‌టికే అసంతృప్తిగా ఉన్న‌వీరు, వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఈ ముగ్గ‌రుతో ఇప్ప‌టికే వైసీపీ ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిగిపోయాయ‌ని, ముత్తంశెట్టి ఆద్వ‌ర్యంలో ఈ మీటింగ్ జ‌రిగింద‌ని, వీరితో పాటు మ‌రికొంద‌మంది నేత‌లు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని, దీంతో ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టేంత వ‌ర‌కు జ‌గ‌న్ ఊరుకునేలా లేర‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార టీడీపీ నుండి సిట్టింగ్ నేత‌లు జంప్ అవుతుండ‌డం ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.