తెలంగాణ అసెంబ్లీ దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు

Friday, June 7th, 2019, 01:39:05 AM IST

తెలంగాణ అసెంబ్లీ దగ్గర కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారణం తెరాస లో సీఎల్పీ విలీనంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్‌ నెలకొంది. సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి.. సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, అద్దంకి దయాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్‌, తదితరులు గాంధీ విగ్రహం ఎదుట నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కాగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, అద్దంకి దాయకర్, పొన్నాల సహా ఇతర నేతలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ అన్ని గేట్లకు తాళాలు వేసిన పోలీసులు.. గేట్-1 నుంచి ఉత్తమ్,భట్టి,శ్రీధర్‌బాబును అరెస్ట్ చేసి.. టప్పాచబుత్ర పీఎస్‌కు తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌.. అసెంబ్లీ ముందు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆయన ఆందోళనతో హైవే పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.. కాగా పార్టీవీడిన వారిపై అనర్హత వేటు వేయాలని, అంతేకాకుండా స్పీకర్ కి విలీనం చేసే హక్కు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు…