న్యూజీలాండ్ మసీదుల్లో మారణకాండ – ఘాతుకానికి పాల్పడ్డ ఉగ్రవాదులు..!

Friday, March 15th, 2019, 04:01:42 PM IST

న్యూజీలాండ్ మసీదుల్లో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో 49మందిని పొట్టన పెట్టుకున్నారు, క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలోని మసీదుల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం నమాజ్ సమయంలో మసీదులు రద్దీగా ఉన్న సమయంలో రెండు మసీదుల్లో చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 49మంది మృతి చెందగా మరో 48మందికి గాయాలైనట్లు, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.ఘటనపై స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆడర్న్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు, న్యూజిలాండ్‌కు ఇది డార్క్ డే అని పేర్కొన్నారు. ఈ దాడిలో ఆటోమేటెడ్ రైఫిళ్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది . ఈ దారుణాన్ని షర్ట్ బటన్‌కు అమర్చిన కెమెరాతో రికార్డ్ చేశారట, అంతే కాకుండా ఆ వీడియోను ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్ టెలికాస్ట్ కూడా చేసారు. 15 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు మసీదుల్లో కాల్పులు జరుపగా క్రైస్ట్ చర్చ్ లోని ఒక మసీదులో 39మంది మరణించగా, లిన్‌వుడ్‌ అవెన్యూలోని మసీదులో మరో 10 మంది మరణించారు.

ఇదిలా ఉండగా బాంగ్లాదేశ్ క్రికెటర్లు ఈ ఉగ్రదాడి నుండి తృటిలో తప్పించుకున్నారు, మసీదులో ప్రార్థనల కోసం వెళ్లిన బాంగ్లాదేశ్ క్రికెటర్లు ఉగ్ర దాడి జరుగుతుందని తెలుసుకొని వెంటనే అక్కడి నుండి బయటపడ్డారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఉగ్రవాదులు పబ్ జి గేమ్ తరహాలో దాడికి పాల్పడ్డారని, దాడిని తప్పించుకున్న తామంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. కాగా, ఈ దాడిని ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్ లో ఉద్రిక్తత నెలకొనటంతో హై అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించి ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

.