పాత బస్తీ… ఇక కొత్త బస్తీ అవుతుందోచ్…

Tuesday, April 17th, 2018, 08:15:38 AM IST

వెయ్యికోట్లతో పాతబస్తీ రూపురేఖలను మార్చే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కంకణం కట్టుకున్నాడు. ఓల్డ్‌సిటీ అంటే సమస్యల పుట్ట అనే పేరును చెరిపేసి సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. పాత చరిత్రలు తిరగ రాసి నగరానికి కొత్త రూపురేకలు తీసుకు వద్దామని సర్వత్రా సిద్దం చేస్తున్నారు. చార్‌సౌసాల్ పురానా షహర్‌పై నయా రోష్నీ వేసేందుకు ముందుకు కదిలారు. కరెంటు, రోడ్లు, కాల్వలు, రిజర్వాయర్లు, వంతెనలతో పౌరసదుపాయాల మెరుగుదలకు స్వయంగా శంకుస్థాపనలు చేసి పనులను కదంతొక్కిస్తానని ప్రకటించారు. పాతనగరంలో విద్యుత్, మంచినీరు, సీవరేజి, నాలాలు, ఎస్సార్డీపీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమైక్యపాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పాతనగరంలో వెయ్యికోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ నగరంలో మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు.

మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాతనగరాన్ని వరదలకు ఆస్కారం లేని, మురికినీరు రోడ్లపై ప్రవహించని, విద్యుత్ సమస్యలు లేని, మంచినీటి ఎద్దడి లేని, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలుచేస్తామని స్పష్టంచేశారు. రంజాన్ మాసం ప్రారంభానికి ముందే తాను పాతనగరంలో పర్యటించి ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రకటిస్తానని చెప్పారు. ఈలోగా ప్రణాళికలు తయారుచేయాలని, అన్ని సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నెలకు రెండుసార్లు పాతనగర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఈ మౌలిక సదుపాయాలే కాకుండా రూ.1600 కోట్లతో చేపట్టే మూసీనది ప్రక్షాళన, ఆధునీకరణ పనులను, రూ.1200 కోట్లతో చేపట్టిన మెట్రోరైలు పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.