ఆ రోజే అన్నీ చెపుతానంటున్న కమల్!

Sunday, February 18th, 2018, 08:20:18 PM IST

తమిళ రాజకీయాలు ప్రస్తుతం అక్కడి ప్రజలకు ఎన్నడూ లేనంతగా రోజు రోజుకు మరింత ఉంత్కంఠ పెంచుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడి ప్రముఖనటులు రజినీకాంత్, కమల్ హాసన్ త్వరలో నూతన రాజకీయ పార్టీలు నెలకొల్పుతూ ఉండడమే. రజిని గత డిసెంబర్ 31న తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా అటు కమల్ కూడా తన రాజకీయ ప్రస్థానంపై త్వరలో తొలి అడుగు వేయనున్నారు. ఆయన ఈనెల 21న పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత బుధవారం సాయంత్రం తమిళనాడులోని రామనాథపురం వద్ద ఉన్న ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనున్నారు. అదే రోజు వివిధ ప్రదేశాల్లో వరస బహిరంగ సభలు ఏర్పాటు చేసి తన రాజకీయ ప్రణాళిక, తను రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటోంది, ఏం చేయాలి అనుకుంటోన్న అంశాలు ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. తరువాత రామేశ్వరంలోని అబ్దుల్‌కలాం నివసించిన ఇంటిని కమల్‌ సందర్శించిన అనంతరం ఆయన సమాధిని సందర్శించి నివాళులు ఆర్పిస్తారు. రామేశ్వరంలోనే గణేశ్‌ మహల్‌ వద్ద మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని తనదైన సాయం చేయనున్నారు.ఈ విధంగా కమల్ తన రాజకీయ ప్రస్తానం పై ముందుకు సాగుతున్నారు…..