ఎమ్యెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారా?

Thursday, March 22nd, 2018, 09:22:27 AM IST

బిజెపి ఎమ్యెల్సీ సోము వీర్రాజు టిడిపి పార్టీని, నేతలను తనదైన శైలిలో ఏకిపారేస్తుంటారు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారం లోకి రావడానికి తమ పార్టీ ప్రధాన కారణమని, అలానే మొదట్లో ప్రత్యేక ప్యాకెజీకి ఒప్పుకున్న బాబు ఇప్పుడు వున్నట్లుండి జగన్, పవన్ లు ప్రత్యేక హోదా నినాదం ఎత్తగానే తనని, తమ పార్టీ ని ప్రజలు పట్టించుకోరు అనే భయంతో హోదా నినాదాన్ని మొదలెట్టారని ఆయన విమర్శలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక వార్త షికారు చేస్తోంది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన నేపథ్యంలో సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలపై వీర్రాజు స్పందిస్తూ, అదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేశారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యేల కోటాలో తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాననిఅన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే, తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. చంద్రబాబు, టీడీపీపై యుద్ధం చేయాలంటూ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు తమను ప్రోత్సహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. యుద్ధం చేయాలని తమకు ఎవరూ చెప్పలేదని, తాము వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నామని తెలిపారు….