ఆ లేఖను బహిర్గతం చేయాలంటున్న టిడిపి !

Wednesday, February 14th, 2018, 12:20:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపు, విభజన హామీలకు సంబంధించి ఏ మాత్రం న్యాయం జరగలేదని అధికార టిడిపి సహా అన్ని పార్టీలు తమ నిరసన గళం విప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాదన లో ఏ మాత్రం నిజం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు హరిబాబు, సోము వీర్రాజు తదితరులు కొట్టిపారేస్తున్నారు. తమ ప్రభుత్వం చెప్పినవన్నీ నెరవేరుస్తోందని, కాకపోతే ఒక్కొక్కటీ అమలు చేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. నాటి యుపిఎ సర్కారు తెలంగాణాలో జరిగిన నిరసనలు అక్కడి ప్రజల అభిప్రాయం సేకరణ తదితర పరిస్థితుల తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్త్ర ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలానే క్లిష్టపరిస్థితుల్లో విడగొట్టబడ్డ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటుగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, లోటు బడ్జెట్ భర్తీ చేసేందుకు దానికి అనుగుణంగా ఆర్థిక సాయం తదితరాలన్నీ ఆ చట్టంలో పొందుపరిచింది.

దీనిపై నాటి రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ, ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అయితే 15 ఏళ్ల పాటు ఇవ్వాల్సిందేనని విపక్ష సభ్యుడిగా ఉన్న ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో యూపీఏ ఓటమి పాలు కాగా ప్రజల ఇచ్చిన ఓటు తీర్పుతో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇది జరిగి ఇప్పటికే నాలుగేళ్లు కావస్తోంది. ఇప్పటిదాకా ఎన్డీఏ సర్కారు నాలుగు పూర్తి స్థాయి బడ్జెట్ లను ప్రవేశపెట్టింది.

మొన్నటి తాజా బడ్జెట్ ను పక్కనపెడితే అంతకుముందు ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్ లలో ఏపీకి అరకొర కేటాయింపులే దక్కాయని చెప్పవచ్చు. ఇక చివరి బడ్జెట్ అయిన తాజా బడ్జెట్లో గత బడ్జెట్ లకు భిన్నంగా ఆ మాత్రం కూడా దక్కలేదాని అంటున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచే కాకుండా మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా నిరసనలు మొదలయినా విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై 27 పేజీలతో కూడిన ఓ లేఖను రాష్ట్ర బిజెపి నేతలు విడుదల చేశారు. ఏపీకి ఇప్పటిదాకా ఏమేం చేశామన్న వివరాలను అందులో పొందుపర్చి, ఇతర రాష్ట్రాలకు రెగ్యులర్ గా ఇస్తున్న నిధులను ఏపీకి విడుదల చేసినా వాటిని కూడా ఏపీకి ప్రత్యేకంగా కేటాయిస్తున్న నిధుల్లాగే పరిగణించి వాటిని కూడా 27 పేజీల లేఖలో ప్రస్తావించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ లేఖ పూర్తిగా బహిరంగం కాలేదన్న చర్చ ఇప్పుడు ఒకపెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు ఏపీకి ఎంతో చేశామని బీజేపీ చెప్తూ ఉంటే మరోవైపు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది చాలా తక్కువేనని ఆ లేఖలోని అంశాలు నిజమేఅయితే దానిని ఎందుకు బహిర్గతమతం చేయడంలేదని టీడీపీ వాదిస్తోంది. ఈ విషయమై ఇప్పుడు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన 27 పేజీల లేఖను బిజెపి తమ సామాజిక మాధ్యమాలలో ఎందుకు పెట్టడం లేదన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. ఏపీకి న్యాయం చేసే విషయంలో చిత్తశుద్దితో బీజేపీ సర్కారు వ్యవహరించి ఉంటే ఆ లేఖను బయటపెట్టే విషయంలో జంకాల్సిన అవసరము ఏముందని కొందరి వాదన. మొత్తంగా బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదని మరికొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ అధికారిక ఫేస్ బుక్ కు వేలాది కామెంట్లను చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఒక్కసారిగా వున్నట్లుండి బీజేపీ తన ఫేస్ బుక్ కు ఉన్న రివ్యూ ఆప్షన్ ను తొలగించేయడం అందరిని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ 27 పేజీల తన లేఖను బహిరంగం చేస్తుందా లేదా, ఆంధ్ర ప్రజలకు ఎంతవరకు తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందనేది వేచిచూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…..