ఆ సినిమానే వాళ్ళ కొంప ముంచింది

Thursday, April 5th, 2018, 04:07:32 PM IST

తాజాగా గవర కంచరపాలెం ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ ఊర్లో నివసించే ప్రయివేట్‌ సంస్థ ఉద్యోగి ఇంట్లో దొంగలు పడి 55 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.75 లక్షల నగదు, రెండున్నర కిలోల వెండి ఎత్తుకెళ్ళారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విధంగా వివరాలు తెలిపారు.

దోపిడీ కి గురైన బాదితుడు భీశెట్టి శ్రీధర్‌ నగరంలోని వరుణ్‌ మోటార్స్‌లో వర్క్స్‌ మేనేజరుగా ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన కుటుంబంతో సెకండ్ షో సినిమాకు వెళ్లారు సినిమా పూర్తయి అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు ఇంటికి తిరిగొచ్చారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లేసరికి రెండు బీరువాలు బారున తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి బీరువాల్లో పరిశీలించగా.. బంగారు, వెండి ఆభరణాలు, నగదు మాయం అయ్యాయి. వెంటనే కంచరపాలెం క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం సీఐ ఎన్‌.సాయి ఆధ్వర్యంలో ఎస్‌.ఐ. ఎం.వి.కుమార్‌ వెంటనే అక్కడికి తరలి వచ్చారు.

పరిసర ప్రాంతాలను పరిశీలించగా దొంగలు ఇంటి వెనుక నుంచి గోడ దూకి వెనక తలుపు తాళం గడియ విరగ్గొట్టి లోపలికి ప్రవేశించినట్టు తెలుసుకున్నారు. చోరీ అయిన బంగారు ఆభరణాల విలువ రూ. 19 లక్షలు ఉంటుందని చెప్పారు. దొంగలు చోరీ చేసిన మొత్తం సొత్తు విలువ రూ. 25 లక్షలుగా అంచనా వేశారు. క్లూస్‌టీం సిబ్బంది ఆధారాల కోసం అన్వేషించారు. దొంగల వేలిముద్రలను సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా అది ఇంటి వెనుక ద్వారం నుంచి బయటకు వెళ్లి సమీపంలో ఉన్న రైల్‌ట్రాక్‌ వద్దకు వెళ్లి ఆగిపోయింది. కంచరపాలెం క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాదితుడు శ్రీధర్‌ కొడుకు కొద్దిరోజుల క్రితం పదో తరగతి పరీక్షలు రాశాడని, మంచి కార్పొరేట్‌ కళాశాలలో చేర్పించాలని కూడబట్టిన సొమ్ముతో పాటు ఇటీవల బ్యాంకులో ఉన్న డబ్బును కూడా తెచ్చి ఇంట్లో దాచి ఉంచుకున్నానని శ్రీధర్ వెల్లడించాడు. ఆ చుట్టుపక్క ప్రాంతంలో ఇలా దొంగతనాలు జరగడం తాము ఎప్పుడూ చూసి ఎరుగాలేదని, పైగా ఇంటిపైన ఉన్న రెండతస్థుల్లో తల్లిదండ్రులు, సోదరుడు ఉండడంతో శ్రీధర్‌ కుటుంబంతో కలిసి ధైర్యంగా బయటకు వెళ్లామని, ఇంతలోనే దొంగలు తాము ఇన్నేళ్ళు సంపాదించుకున్నదంతా దోచుకేల్లారని, కొడుకు చదువు ఏమయిపోతుందోనని వాపోయారు.

అయితే ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి దొంగతనం జరిగిన ప్రాంతంలోనే మరో ఇంట్లో దొంగలు చోరీకి ప్రయత్నించినట్టు తెలిసింది. బాధితులు అందుబాటులో లేని కారణంగా ఆ ఇంట్లో ఏమేం పోయాయో పోలీసు అధికారులకు స్పష్టత రాలేదు. వీలైనంత తొందరలోనే దొంగలను పట్టుకొని పోయిన సొమ్మును, దమమును రాబట్టేలా తగిన చర్యలు తీస్కుంటామని పోలీసులు వివరించారు.