ఆ పార్టీ ఎమ్యెల్యే లు మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారు : చీఫ్ విప్ పల్లా

Tuesday, March 13th, 2018, 03:22:56 AM IST

ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే శాసన సభ్యులు ఎవరైనా హుందాగా వ్యవహరిస్తారు. అది కూడా శాసనసభా సమావేశాలకు విచ్చేసేటపుడు వారు మరింత హుందాగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్‌ సభ్యులు మద్యం తాగి వచ్చారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శాసన సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన శాసన వ్యవస్థే తలదించుకునేలా ఉందని ఆయన విమర్శించారు. సహచర సభ్యుల గోల భరించలేక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సమావేశాల మధ్యలోనే లేచి వెళ్లిపోయారని పల్లా చెప్పారు. మద్యం తాగి రావడంతో కొందరు సభ్యులు జానారెడ్డిపై తూలి పడబోయారని ఆయన మండిపడ్డారు.

ఆ విధంగా అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ సభ్యులను ఏడాది పాటు సస్పెండ్‌ చేయాలని రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు సభ్యులు బడ్జెట్స్ ప్రతులను చించి సభాపతి స్థానం వైపు విసిరారు కూడా. ఆ గొడవ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన చెవులకు పెట్టుకున్న హెడ్ ఫోన్స్‌ను గవర్నర్ వైపు విసిరారు. అయితే అది పక్కనే ఉన్న మండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌కు తగిలింది. దీంతో ఆయన కంటికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇకనైనా కాంగ్రెస్ సభ్యులు మర్యాదతో నడుచుకుంటే మంచిదని, పాలనలో లోపాలుంటే ప్రభుత్వాన్ని నిలదీయలేకాని, ఇలా సభామర్యాదకు భంగం కలిగేలా ప్రవర్తించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదని ఆయన అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments