అప్పుడు ప్యాకెజీకి ఒప్పుకుని ఇప్పుడు మాట ఎందుకు మార్చారు : హరిబాబు

Sunday, April 15th, 2018, 11:54:18 PM IST


ఓ వైపు కేంద్ర బిజెపి ప్రభుత్వం పై ఆంధ్ర ప్రదేశ్ లోని మిత్రపక్ష టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని ఆంధ్ర బిజెపి నేతలు అంటున్నారు. నాడు మోడీ ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి సరైన రీతిలోనే నిధులను పంపిణీ చేస్తున్నారని అంటుంటే. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం విభజన హామీలు, అలానే రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకెజీ విషయమైకూడా ఇప్పటివరకు ఏమాత్రం న్యాయం చేయలేదని అంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రభుత్వం చేసిన సాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భాజపా రాష్ట్ర నాయకత్వం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే కేంద్రం నుంచి అందిన సాయమెంతో ప్రజలకు తెలియజెప్పాలన్న ఆలోచనతో ‘ రాష్ట్రానికి కేంద్ర సహకారం’ అనే పేరుతో ఓ బుక్‌లెట్‌ను భాజపా విడుదల చేసింది.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విజయవాడలో ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే బుక్‌లెట్‌ విడుదల చేశాం. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో బుక్‌లెట్‌ రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలకు దీనిలో సమాధానం ఇచ్చాం. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసమే ప్రత్యేక హోదా ఇస్తామన్నాం. హోదా సాధ్యం కాదని ప్రత్యేక నిధుల మంజూరుకు కేంద్రం అంగీకరించింది. హోదాతో ఐదేళ్లలో రూ.15వేల కోట్ల వరకు లబ్ధి చేకూరేది. ప్యాకేజీ రూపంలో అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. ప్యాకేజీ ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభినందించింది.

కానీ ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి అన్యాయం చేశారని మాట్లాడటం బాధగా ఉంది. కేంద్రంపై చేసే ఆరోపణలన్నీ నిరాధారం, అసత్యం. సింగపూర్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు నిందించడం అభ్యంతరకరం. గతంలో ఏ పార్టీ నాయకుడూ విదేశీ గడ్డపై ప్రధానిని నిందించలేదు. ప్రధాని దీక్షను తప్పుబట్టిన చంద్రబాబు ఈ నెల 20న దీక్ష చేస్తారో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. ఆంధ్ర లో బిజెపిని తొక్కిపట్టే విధంగా టిడిపి నేతల కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోందని ఆయన విమర్శించారు. ఎవరు ఏమనుకున్నా తమ ప్రభుత్వం చెప్పినప్రకారం అందరికి న్యాయం చేస్తుందని ఆయన అన్నారు……