ఆ టెలికాం కంపెనీల విలీనం తెచ్చిన తిప్పలు

Monday, April 16th, 2018, 02:30:13 PM IST

ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఆగమనం తర్వాత మిగతా టెలికాం సంస్థలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. జియో పోటీను తట్టుకుని నిలబడేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నాయి. ఆ క్రమంలో నష్టాలను కూడా చవిచూస్తున్నాయి. అలా నష్టాల నుంచి గట్టెక్కేందుకు వొడాఫోన్‌, ఐడియా విలీనం బాట పట్టాయి. ఈ విలీనం పూర్తయితే ఎయిర్‌టెల్‌ను దాటి దేశంలో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ ఆపరేటర్‌గా ఈ సంస్థలు నిలవనున్నాయి. ఆర్థిక నష్టాలను చవిచూస్తున్న వొడాఫోన్‌, ఐడియా సంస్థలు ఆ భారాన్ని కాస్త తగ్గించుకునేందుకు విలీనం దిశగా వెళ్తున్నాయి. రెండు కంపెనీలకు కలిపి రూ.1.20లక్షల కోట్ల అప్పులున్నాయి. దీంతో విలీనం తర్వాత ఖర్చులను తగ్గించుకుని, సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి ఈ కంపెనీలు.

ఇందుకు సంబంధించి విలీన ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకున్నట్లే తెలుస్తోంది. అయితే ఈ విలీనం ఆయా కంపెనీల ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ రెండు సంస్థలు ఒకటైన తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించుకున్నాయట. రానున్న రెండు నెలల్లోనే ఈ రెండు సంస్థల నుంచి దాదాపు 5వేల మంది ఉద్యోగులను తీసేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రెండు కంపెనీల్లో కలిపి 21వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో పావు వంతు అంటే దాదాపు 5వేల మందిని వచ్చే రెండు నెలల్లో విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. మే చివరి నాటికి ఈ విలీనం పూర్తయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ వార్తలపై ఐడియా స్పందించలేదు. అయితే వొడాఫోన్‌ మాత్రం వీటిని తోసిపుచ్చింది. ఇవన్నీ ఊహాగానాలే అని, విలీనం తర్వాత ఉద్యోగుల గురించి కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వొడాఫోన్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు…..

  •  
  •  
  •  
  •  

Comments