అలంటి వారి గుండె పదిలంగా వుంటుందట!

Wednesday, June 20th, 2018, 12:27:29 AM IST


ప్రస్తుత సమాజంలో మనిషికి ఉరుకులు పరుగులు జీవనం అలవాటు అయిపోయింది. అంతా చాలావరకు డిజిటల్ మయం కావడంతో మనిషికి శ్రమపడే అవకాశం తగ్గిందని చెప్పవచ్చు. ఒకరకంగా మనిషి ఆలోచనల్లో, శరీరంలో కొత్త కొత్త సమస్యలు తలెత్తడానికి ఈ నూతన పోకడలు కూడా ఒకరకంగా కారణం అని చెప్పవచ్చు. అయితే దానికి తగ్గట్లు నేటి మనిషి రోగాల బారిన కూడా ఎక్కువగా పడుతున్నాడు. వయోబేధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు అందరికి సోకుతున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు ఒక వయసు వచ్చిన వారికి మాత్రమే వచ్చే గుండెపోటు నేడు పెద్దగా వయోబేధం తేడాలేకుండా వస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే పెళ్లికాని వారికి హృద్రోగ సమస్యలు ఎక్కువ అవడం తద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని,

పారిస్ లోని రాయల్ స్ట్రోక్ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో పేరెన్నికగన్న డాక్టర్ చున్ వాయ్ వాంగ్ నేతృత్వంలోని బృదం మెడికల్ జర్నల్ హార్ట్ అనే నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు దశాబ్దాల పాటు యూరప్, ఉత్తర అమెరికా, మధ్య, పశ్చిమ ఆసియాలకు చెందిన వివిధ సంస్కృతుల, ప్రాంతాల ప్రజలపై జరిపిన పరిశోధనల్లో పెళ్ళైన వారితో పోలిస్తే పెళ్లికాని వారిలో హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం 42 నుండి దాదాపు 55 శాతం వరకు ఉన్నట్లు తేలిందని, అదే విధంగా తమ భార్య, లేదా భర్తలతో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించేవారిలో కూడా 42 శాతానికి పైగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువట.

ఇక పెళ్ళైన వారిలో చాలావరకు తమ జీవనం సుఖంగా ఉందని, అలానే జీవిత భాగస్వామితో జీవితం సాగుతున్నప్పుడు ఒత్తిడికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉండదని చెపుతున్నారు. అయితే పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారిలో కూడా హృద్రోగ సమస్యలు ఎక్కువని, ఎందుకంటే వారి అనుబంధం ఎక్కడ బయటపడుతుందో అని అటువంటి వారి మరింత ఆవేదన, ఆలోచనకు లోనవుతారట. అందువల్ల పెళ్లికాని బ్రహ్మచారులు, ఆడవారు ఎవరైనా తమకు భవిష్యత్తులో ఆనందంగా ప్రశాంతంగా ఉండాలన్న, హృద్రోగ సమస్యలకు దూరంగా ఉండాలన్న పెళ్లి ఒక మంచి మార్గమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు మరి…..