అవి చంద్రబాబు మార్క్ సర్వేలట!!

Thursday, June 21st, 2018, 12:03:00 AM IST


ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు మంచి రసకందాయంలో సాగుతున్నాయి. అన్ని ప్రధానపార్టీల అధినేతలు అధికారం చేజిక్కించుకోవడానికి తమ తమ రాజకీయ యుక్తితో ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా మళ్లి అధికారం పొందాలని టీపీడీ చూస్తుంటే, తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ చూస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కూడా తన మార్కు రాజకీయంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక ఆ విషయం అటుంచితే, రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం ఇటీవల చేపట్టిన కొన్ని సర్వేలే నిదర్శనమని కొందరు రాజకీయవేత్తలు అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముందస్తు సర్వే లు చేయించడంలో మంచి దిట్ట, అంతే కాదు ఇదివరకు ఆయన చేయించిన సర్వేల్లో వచ్చిన ఫలితాలే గత రెండు మూడు ఎన్నికల్లో దాదాపుగా దగ్గరగా వచ్చిన విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం అయన ఒక జాతీయ మీడియా సంస్థ వారితో చేయించిన సర్వే లో టీడీపీకి 110 సీట్లు, ఎస్పీకి 60 సీట్లు వస్తాయని తేలింది. ఇక మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన సొంత సంస్థలతో చేయించిన సర్వేల్లో కూడా మెజారిటీ సీట్లు టీడీపీనే దక్కించుకోనుందని అంటున్నారు. ఇకపోతే రాజముండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి నిన్న మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబును అంత తక్కువ అంచనా వేయలేమని, ఆయన విజన్, వ్యూహాలు మనకు అంతుపట్టవని, అదీకాక టీడీపీకి ఎప్పటినుండో వున్న కొంత కోటరీ కూడా మరోసారి ఆయనకు అధికారాన్ని తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదని అన్నారు. ఈ రకరకాల సర్వేలపై కొందరు వైసిపి, బిజెపి, వామపక్ష నాయకులు మాట్లాడుతూ అవి అన్నియు పూర్తిగా బాబు మార్కు సర్వేలని, వాటి ఫలితాలప్రకారం ఏపీలో చంద్రబాబు గాలే వీస్తోందని, మళ్లి ఆయనే అధికారంలోకి వస్తున్నారనే తప్పుడు వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను మభ్యపెట్టి, మాయ చేస్తున్నారు అన్నారు.

చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు ఎన్నిపన్నినప్పటికీ ఇప్పటికే పూర్తిగా మసకబారిన టిడిపి ప్రాభవాన్ని ఇప్పటికిప్పుడు తిరిగి పొందడం ఆయనవల్ల కానీ, టిడిపి నేతలవల్ల కానీ కుదిరేపని కాదని రానున్న ఎన్నికల్లో మేము అధికారం తప్పక చేపట్టి తీరుతామని వైసిపి నేతలు అంటున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కూడా చంద్రబాబు మన ఊహకందని తెలివితేటలున్న నాయకులని, ఆయన ఈ విధంగా తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మళ్ళి బాబే వస్తున్నదంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని, ఈసారి ప్రజల అభిమానం తమ పార్టీకి తప్పక లభిస్తుందన్న నమ్మకం ఉందని అంటున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష నేతలు కూడా బాబు చేయించేవన్నీ దొంగ సర్వేలని, ఆయన మార్కు రాజకీయాన్ని చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలివిగా ఉపయోగిస్తూ పూర్తిగా అణగారిపోయిన టీడీపీ ప్రతిష్టని మళ్ళి తామే వస్తున్నామంటూ అబద్దాలతో డప్పులు కొట్టుకుని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఏపీలో ఎంతో ఉత్కంఠతతో సాగనున్నాయి అని చెప్పక తప్పదు…..