అది కేసీఆర్ ఆడుతున్న మరొక కొత్త నాటకం : వి హనుమంతరావు

Tuesday, May 8th, 2018, 11:36:44 PM IST

అవకాశం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ పై అలానే ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా వున్న ఆయన మళ్లి వయోలెంట్ గా మారి కేసీఆర్ పై మాటల దాడి మొదలుపెట్టారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేసీఆర్ కొత్తగా రైతుబంధు పధకాన్ని తీసుకువచ్చి సరికొత్త నాటకాన్ని మొదలుపెట్టారాని ఆయన విమర్శించారు.

ఇదివరకు రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే, నిలదీసి, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. మళ్ళి ఆయనే ఎంతోమంది రైతులను జాలి, దయ, కనికరం లేకుండా అరెస్ట్ చేయించిన విషయం మర్చిపోలేమన్నారు. రైతు బంధు అంటే రైతులకు సంకెళ్లువేయడమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు మూడువేల మంది రైతులు సమస్యలు తట్టుకోలేక చనిపోతే, కనీసం వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కరూపాయి కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.

త్వరలో తలపెట్టిన రైతు బంధు కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ కూడా రావద్దని తాను లేఖలు రాస్తానని అన్నారు. కాగా రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే మళ్లి ఇప్పుడు ఓటుకు నోటు కేసును బయటకు తీసారని అన్నారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని తెలిపే వాల్ పోస్టర్ లను ఆవిష్కరించిన ఆయన, వాటిని త్వరలో రాష్ట్రం మొత్తం అంటించి ఈ ప్రభుత్వ అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడల వల్లనే రాష్ట్రం ఇలా ఉందని, ఆయన ఆ విధమైన పద్దతులను పక్కనపెట్టి, ప్రజల మీద, ప్రజా సమస్యల మీద దృష్టిపెట్టాలని హితవు పలికారు……..