అక్కడ ‘కాలా’ చిత్ర ప్రదర్శనను ఆపడం కరెక్ట్ కాదు : రజినీకాంత్

Wednesday, June 13th, 2018, 04:47:49 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నూతన చిత్రం కాలా ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలవ్వబోనివ్వమని కర్ణాటక సినీ సంఘాలు అభ్యన్తరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై అక్కడి కోర్ట్ ని ఆశ్రయించారు చిత్ర నిర్మాత ధనుష్. ఆయన అభ్యర్థనపై స్పందించిన కోర్ట్ కాలా ని ఇక్కడ విడుదల చేయకుండా ఆపడం సరైనది కాదని, దానివల్ల సినిమాని కొన్నవారు నష్టపోతారని, వెంటనే చిత్రాన్ని విడుదల చేయాలనీ, కాకపోతే ఆ చిత్రం విడుదలయ్యే థియేటర్ల వద్ద మాత్రం గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేయవలసిందిగా తీర్పు నిచ్చింది.

ఆ తరువాత ఈ వివాదం విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, తమకు కోర్ట్ తీర్పు పై పూర్తి గౌరవం వుందని, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చిత్రాన్ని విడుదల చేయడం కుదరదని తెలిపారు. కాగా ఈ విషయమై రజిని, ముఖ్యమంత్రి కుమారస్వామికి పర్సనల్ గా మెసేజ్ చేసి చిత్రాన్ని విడుదల చేయవలసిందిగా కోరారు. కానీ కుమార స్వామి మాత్రం ఇప్పటివరకు విడుదల విషయమై స్పందించకపోవడంతో నేడు మరోమారు రజిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను ఎన్నడూ ఏ ప్రాంత వారికీ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, అన్ని ప్రాంతాలవారు తనకు సమానమేనని, అందరూ ఆదరించబట్టే తన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.

అయితే అందరూ అంటున్నట్లు నిజానికి తాను కావేరి జలాల విషయంలో కన్నడికులనుకానీ కర్ణాటక ప్రాంతాన్నికానీ విమర్శించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కేవలం కావేరి జలాల విషయమై సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు మేరకు యజమాన్య నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలి అని మాత్రమే అన్నానని, దీనికే నా మీద వ్యక్తిగత కక్షతో చిత్రాన్ని ప్రదర్శించకుండా నిలిపివేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కావున సీఎం కుమారస్వామి ఇకనైనా చొరవ తీసుకుని తన చిత్రాన్ని అక్కడ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని, అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే రజిని అభ్యర్ధనను కర్ణాటక వాసులు, సీఎం కుమారస్వామి ఏ విధంగా స్వీకరించి సమాధానమిస్తారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది…..

  •  
  •  
  •  
  •  

Comments