అదే అంబెద్కర్ గారికి నిజమైన నివాళి : కేటీఆర్

Sunday, April 15th, 2018, 02:00:01 PM IST

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖామంత్రి కేటీఆర్ మంచి మాటకారి. అంతే కాదు సందర్భానుసారం మాట్లాడడం ఆయనకు గల మరొక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటారు. అలాంటి కేసీఆర్ తాజాగా ఆసక్తికరమైన ప్రసంగం ఒకటి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కులం అనే భావనకు కొత్త సూత్రీకరణ చేశారు. ఎస్సీలకు తెలంగాణలో దక్కినట్లుగా ప్రోత్సాహం దేశంలో మరెక్కడా దక్కడం లేదని కేటీఆర్ అన్నారు. వారికి తగు శిక్షణ ఇచ్చి దళిత, గిరిజన గుత్తేదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దళితులకు బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

అలానే సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఎన్ పీఏ బారిన పడకుండా పరిష్కారం చూపిస్తామన్న ఆయన రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్ తో మూతపడే స్థితిలో ఉన్న కంపెనీలను ఆదుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసం ఆచరణతో, త్రికరణ శుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం టిఆర్ ఎస్ అని ఆయన అన్నారు. కేవలం మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూయించడమే అంబెద్కర్ గారికి మనము ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. దళిత పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నం. పారిశ్రామిక హెల్త్ క్లీనిక్ దేశంలో ఎక్కడా లేదు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ద్వారా పరిశ్రమలను పునరుద్దరిస్తున్నాం. ఒక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఉన్నవారు లేని వారు తప్ప భవిష్యత్తులో మరో కులం ఉండదు అంటూ కొత్త విశ్లేషణను కేటీఆర్ చేశారు.

బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ఉద్యమం చేసి ముందుకు వెళ్లి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని కేటీఆర్ వివరించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని మూడున్నరేళ్లలో గొప్ప పాలన అందించడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాతమని, పేదల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అందరు నేతలు, కార్యకర్తలు తగు కృషి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు…..