అందుకే మోత్కుపల్లి చంద్రబాబుపై విషం కక్కుతున్నారు : టీడీపీ మంత్రి

Tuesday, May 29th, 2018, 04:21:05 PM IST

టిటిడిపి నేత, సీనియర్ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబు టీడీపీ ద్రోహి అని, ఎన్టీఆర్ నుండి ఆయన పార్టీని పదవిని లాక్కున్నారని, అంతేకాదు ఎన్టీఆర్ ఎంతో క్షోభపడి మరణించడానికి అసలు కారణం చంద్రబాబేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై పలువురు టిడిపి నేతలుతీవ్రస్థాయిలో మండిపడుతూ మోత్కుపల్లి ఒక స్వార్ధపరుడని, తనకు పదవులు దక్కలేదనే ఆయన చంద్రబాబుపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

కాగా నేడు ఈ విషయమై ఎక్సయిజ్ శాఖా మంత్రి జవహర్ మాట్లాడుతూ, మోత్కుపల్లి తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీ పై, పార్టీ అధినేత చంద్రబాబు పై ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదని అన్నారు. నిజానికి మోత్కుపల్లికి గవర్నర్ పదవి, లోక్ సభ సీటు వంటివి రాకపోవడంతో దానిని మనసులోపెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు పై విషం వెళ్ళ గక్కుతున్నారని అన్నారు. చంద్రబాబు మోత్కుపల్లికి పార్టీలో మంచి సముచిత స్థానం కల్పించారని, అంతేకాక ఆయనకు గవర్నర్ పదవి ఇప్పించడం విషయంలో తీవ్ర కృషిచేసారని, అయిప్పటికీ అవకాశం లేకపోయిందని అన్నారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసునని, పదవులు దక్కలేదనే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎప్పటినుండో చంద్రబాబు గారికి ప్రియశిష్యుడినని, ఆయన పాలనను అద్భుతం అని ప్రశంసించిన మోత్కుపల్లికి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నియంతలా, మోసగాడులా ఎలా కన్పించారని ప్రశ్నించారు.

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యవహార శైలి ఎప్పటికీ మంచిది కాదని, తన మనసులో ఏదో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని అన్నారు. చంద్రబాబు దళితుల, అణగారిన వర్గాల వారిపట్ల ఎంతో సౌమ్యతతో వ్యవహరిస్తూ వారికోసం జీవో నెంబర్ 25ను అమలుచేసి దళితులను మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని చూస్తున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను పొగుడుతున్న మీరు, ఆయన మంత్రివర్గంలో కనీసం ఒక్కమహిళకు కూడా అవకాశం కల్పించకపోవడం కనపడలేదా అని అన్నారు. కాబట్టి ఇకనైనా పార్టీపట్ల కృతజ్ఞతతో వ్యవహరిస్తే మంచిదని, ప్రజలపట్ల కాస్త సానుభూతి అయినా మిగులుతుందని, మరొక్కమారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలెకాదు, ప్రజలుకూడా ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెపుతారని స్పష్టం చేశారు……

  •  
  •  
  •  
  •  

Comments