విహారయాత్ర విషాదంగా మారింది!

Thursday, May 10th, 2018, 05:42:11 AM IST

కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన అతడు ఆందోళనకారుల చేతుల్లో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే తమిళనాడు లోని పట్టాభిరామ్ ప్రాంతానికి చెందిన తిరుమణి కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అగ్ర ఐటి సంస్థ యాక్సెంచర్ లో ఎనలిస్ట్ గా పనిచేస్తున్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం అతని తల్లితండ్రులు హాయిగా జమ్మూ కాశ్మీర్ కు విహారయాత్రకు వెళ్లాలని వుంది అని తిరుమణిని, అతని అక్కని కోరారు. అంతే, వెంటనే నలుగురు కలిసి జమ్మూ పయనమయ్యారు. యాత్రలో భాగంగా గుల్మార్గ్ ప్రాంతంలో వెళుతున్న సమయంలో తిరుమణి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళనకారులు అక్కడి వారిపై రాళ్ళు రువ్వడం మొదలెట్టారు. ఆ సమయంలో తల్లిని కారులోనుండి తోసేసింది తిరుమణి అక్క.

ఆందోళనకారులు మనమీద రాళ్లు రువ్వుతున్నారురా అని నాన్న ఎంత గట్టిగా అరుస్తున్నా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకున్న తిరుమణికి వినపడలేదని, అంతే ఒక్కసారిగా జరిగిన రాళ్ల దాడిలో అతనికి తీవ్రగాయాలయి అక్కడికక్కడే మరణించాడు. అమ్మను తోసేసినట్లే నా సోదరుణ్ణి కూడా తోసేసి ఉంటే అతడు బ్రతికేవాడేమో అని అతని అక్క కన్నీరు మున్నీరవుతూ జరిగిన సంఘటనపై మీడియాతో మాట్లాడారు. మంగళవారం తిరుమణి మృతదేహాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సందర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా తిరుమణి మృతితో పట్టాభిరామ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి…….

Comments