ఎంతో పవిత్రమైన శబరిమలని అపవిత్రం చేసారు… శశి థరూర్

Friday, November 9th, 2018, 03:02:37 PM IST

ఎంతో పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి అనవసరమైన రాజకీయాలు అంటగట్టి ‘‘అపవిత్రం’’ చేయవద్దంటూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అధికార, విపక్ష పార్టీలకు హితవు పలికారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై అటు ఆర్ఎస్ఎస్, బీజేపీలతో పాటు ఇటు కేరళ ప్రభుత్వాన్ని సైతం తనదైన శైలిలో శశి థరూర్ నిలదీశారు. సంప్రదాయక ఆధునికతకు, మరియు మారుతున్న ప్రపంచంలోని మన సమాజానికి మధ్య లోతైన ప్రశ్నలను లేవనెత్తుతున్న ఈ అంశాన్ని తక్కువగా తీసిపారేయడం సరికాదు. బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎలాంటి హింసకు దారితీశాయో మనం కళ్లారా చూశాం. శబరిమలలోని ప్రజలను భయపట్టే విధంగా వ్యవహరించడం చాలా దారుణమైన ఘటన. పవిత్ర క్షేత్రమైన ఈ ప్రదేశాన్ని రాజకీయాలకు వేదికగా మారుస్తూ… తన పార్టీకి సువర్ణ అవకాశం దొరికినట్టు బీజేపీ నాయకులు భావించడం నిజంగా మనకి చాల సిగ్గుచేటు అని శశిథరూర్ మండిపడ్డారు. శబరిమల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు కేరళ ప్రభుత్వ వైఖరి కూడా బాగోలేదని, కేరళ ప్రభుత్వం పై దుయ్యబట్టారు. భాగస్వామ్య పక్షాలన్నిటితోనూ చర్చలు జరిపి అందరికీ ఆమోయోగ్యమైన రీతిలో ప్రభుత్వం ముందుకెళ్లాలి కానీ అలాంటిదేమీ లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసేందుకు హడావిడిగా ముందుకెళ్లడం వల్లే సమస్యలు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తుల మనోభావాలు గౌరవిస్తూనే, మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు శశి థరూర్ గారు చెప్పుకొచ్చారు.