ఇళ్లైనా కట్టిస్తాం, అద్దె ఐన చెల్లిస్తాం…

Wednesday, November 7th, 2018, 12:01:36 AM IST

త్వరలో జరిగే ముందస్తు ఎన్నికలలో బీజేపీ మేనిఫెస్టో అన్ని వర్గాల ఆంక్షలు నెరవేర్చేలా ఉంటుందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయరంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటివి రైతులతో బాటు అన్ని వర్గాలూ అభినందించేలా ఉంటాయని స్పష్టం చేసారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఎస్సి, ఎస్ టీ, మోర్చా కమిటీలకు ఎన్నికల ప్రణాళిక పై సలహాలు,సూచనల స్వీకరణ నిమ్మిత్తం చర్చ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధులుగా డా.లక్ష్మణ్, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కెసిఆర్ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి దళితులని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, భారీ సైజులో అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు, 12శతం రిజర్వేషన్ వంటి అనేకమైన హామీలను విస్మరించి కెసిఆర్ పరిపాలన కొనసాగించారని విమర్శించారు. చిన్న కులాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన సబ్ ప్లాన్ ని కూడా తుంగలో తొక్కేలా వ్యవహరించారని, మండిపడ్డారు. దళితుడిని ఏకంగా రాష్ట్రపతిని చేసిన ఘనత కేంద్రం లోని మోడీ ప్రభుత్వానిదేనని, గతం లో ప్రధానమంత్రి దళితులూ రాష్ట్రపతి కాకుండా అనేకసార్లు అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెరాస ప్రభుత్వం విస్మరించిన డిఎస్సి, పెన్షన్, ఇంటి నిర్మాణానికి సబ్సిడీ వంటివి అంశాలను మానిఫెస్టోలో చేర్చనున్నట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలవారు వీలుగా కేజీ టూ పీజీ విద్య ని పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్లలకి శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి చేయూతనివ్వనున్నట్లు తెలిపారు. ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్లు బలోపేతం చేసి, రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేస్తామని, 150 అడుగుల ఎత్తులో అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. తెరాస, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీలను మభ్యపెట్టి 12 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా అడ్డు తగిలేలా వ్యవహరించాయని విమర్శించారు.

  •  
  •  
  •  
  •  

Comments