అనధికార లేఅవుట్లతో తంటాలు

Saturday, September 13th, 2014, 09:30:55 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ విభజన తర్వాత మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి నూతన రాజధాని నగరాన్ని విజయవాడ సమీపంగా ఏర్పాటు చేయనున్నట్లుగా ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో వరల్డ్ క్లాస్ రాజధాని ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కృష్ణా, గుంటూరు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న అనధికార లేఅవుట్ లు పెద్ద తంటాగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పతాక స్థాయిలో రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు చేస్తుండగా ఇక్కడ దిగువ స్థాయిలో పరిస్థితి మాత్రం అనధికార లేఅవుట్ ల వలన ముప్పును ఎదుర్కొంటోంది.

కాగా ప్రభుత్వ అధికార యంత్రాంగంలో సరైన సమన్వయం లోపించడం వలన కూడా ఈ అసంఘటిత, అనధికార లేఅవుట్లు పుట్ట గొడుగుల్లా వ్యాపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఉడా అధికారులు, గ్రామస్థాయి ఉద్యోగుల సహాయ సహకారాలతో కూడా రియల్టర్లు ఈ అనధికార లేఅవుట్లను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వారు అనధికార లేఅవుట్ లతో అప్రమత్తంగా ఉండమని ప్రజలకు చిన్న సందేశం ఇచ్చి తమ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వీజీటీఎం మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమగ్ర తనిఖీలు జరిపి అనధికార లేఅవుట్ లపై తగిన చర్యలు తీసుకోని పక్షంలో బయ్యర్లకు విపరీతమైన నష్టాలు ఏర్పడతాయని, కావున అధికారులు వెంటనే స్పందించాలని పలువురు విజ్ఞ్యప్తి చేస్తున్నారు.