వారసత్వం ఆస్తిలోనే కాదు పోలిస్ కేసులో కూడా..!

Tuesday, March 13th, 2018, 03:06:22 PM IST

ఈ మధ్య మైనర్లు నడపడం చాలా కామన్ అయిపొయింది. నిజానికి మైనర్లు వాహనాలు నడపడం చట్ట ప్రకారం నేరం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే వయసు, అర్హత లేకున్నా కూడా ఇళ్ల నుంచి వాహనాలను తీసుకెళ్లే మైనర్లను నివారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ప్రభుత్వం చెప్తుంది. అయినా కొందరు తల్లిదండ్రులు ఆ అంశంపై ఇంకా ఆలోచన చేయడం లేదు. ఇన్నేళ్లు ఈ విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు కౌన్సెలింగ్‌కే పరిమితం కావడంతో పెద్దగా మార్పు కనిపించకపోవడం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా పంథా మార్చారు. కౌన్సెలింగ్‌తోనే వదిలేయకుండా వాహనాలు నడిపే మైనర్లతో పాటు తల్లితండ్రులపైనా కేసులు నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్దం అయ్యారు. ఈ అంశమే మైనర్‌ డ్రైవర్ల కుటుంబాల్లో గంగోలెట్టిస్తోంది. కేసులు పెట్టడంతోపాటు న్యాయ స్థానంలో అభియోగ పత్రాలు నమోదు చేస్తుండటంతో శిక్షలు ఖరారవుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది.

ఈ ప్రక్రియ ఆరంభించిన కేవలం రెండు నెలల్లోనే నగర కమిషనరేట్‌ పరిధిలో 69 మంది తండ్రులు కటకటాల పాలయ్యారు. అంటే దాదాపు రోజుకొక్కరు చొప్పున జైలుశిక్ష అనుభవించారు. రాబోయే రోజుల్లో అభియోగపత్రాల నమోదులో ట్రాఫిక్‌ పోలీసులు మరింత దూకుడు ప్రదర్శించనుండటంతో మైనర్‌ డ్రైవర్ల తండ్రులకు చిక్కులు మరింతగా పెరగనున్నాయి. మైనర్లకూ జైలు శిక్షలు.. మైనర్ల డ్రైవింగ్‌ విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటివరకు సంయమనం పాటించారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేవలం కౌన్సెలింగ్‌తోనే సరిపెట్టి ఇంటికి పంపేవారు. ఎప్పుడైనా మైనర్లు వాహనాలను నడుపుతూ పోలీసులకు దొరికితే, వాహనాల్ని స్వాధీనం చేసుకొన్న అనంతరం తల్లిదండ్రులను ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రాలకు పిలిచి నిపుణులతో కౌన్సెలింగ్‌ చేయించేవారు. మైనర్ల డ్రైవింగ్‌తో కలిగే దుష్పరిణామాల్ని వివరించి మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు. కొందరు మైనర్లయితే గండిపేట చెరువు కట్టపై రేసింగ్‌లకూ పాల్పడేవారు. వారాంతాల్లో తరచూ జరిగే రేసింగ్‌ల్లో పదుల సంఖ్యలో వాహనదారులు దొరికితే..వారిలో పలువురు మైనర్లుండేవారు.

అప్పట్లో తల్లిదండ్రులను కౌన్సెలింగ్‌కు పిలిచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్దగా మంచి ఫలితాలను ఇవ్వలేదు. దాంతో తండ్రులపైనా కేసుల పెట్టే ప్రక్రియను రెండు నెలల కిందట ప్రారంభించి ఇటీవల మరింత తీవ్రతరం చేశారు. దీంతో తండ్రులు జైలులో ఊసులు లెక్కపెట్టడం ఊపందుకుంది. కొద్దిరోజుల క్రితం ఇలాగే చిక్కిన మైనర్‌బాబుకు న్యాయస్థానం జైలుశిక్ష విధించడంతో జువెనైల్‌ హోంకు తరలించారు. రాబోయే రోజుల్లో అభియోగపత్రాల నమోదును తీవ్రతరం చేయనున్నట్టు నగర ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ తెలిపారు. ఇకనుండైనా మైనర్ బాబుల ఆగడాలు తగ్గుతాయని ఆశిస్తున్నట్టుగా, కనీసం తల్లిదండ్రులైనా భయపడి పిల్లలకి వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడతారని ట్రాఫిక్ పొలిసు విభాగం తెలిపింది.