అలా ఎగ‌సి – ఇలా ప‌డిపోయిన‌.. మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి.. ప్ర‌త్యేక క‌థ‌నం..!

Tuesday, November 13th, 2018, 11:24:15 AM IST

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన రెడ్డిని.. అంబిడెంట్ కంపెనీ స్కాంలో భాగంగా 600 కోట్ల‌తో సంబంధం ఉంద‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. తాజాగా సీసీబీ పోలీసులు గాలి జానార్ధ‌న్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒక సాధార‌ణ కానిస్టేబుల్ కొడుకు అయిన గాలి జ‌నార్ధ‌న్ అతి త‌క్కువ కాలంలోనే ఒక రాష్ట్ర రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే స్థాయికి ఎదిగారు.

ఒక‌వైపు రాజ‌కీయ నాయ‌కుడిగానూ, మ‌రోవైపు సక్సెస్‌ఫుల్ వ్యాపార‌వేత్త‌గానూ ఎదిగి.. చాలా ఏళ్ళుగా శాసించారు ఈ మైనింగ్ కింగ్. అయితే ఎంత వేగంగా అయితే ఎదిగారో.. ఆయ‌న ప‌త‌నం కూడా అంతే వేగంగా స్టార్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఒక రాష్ట్ర సహజ సంపద‌ను అడ్డంగా దోచుకున్నార‌నే అభియోగంతో జైలుకు వెళ్లి నాలుగేళ్ళు శిక్ష అనుభ‌వించారు.

గాలి జ‌నార్ధ‌న రెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ మొద‌ట బ‌ల్లారిలో స్టార్ట్ అయ్యింది. 1999లో ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న‌సోనియా గాందీ, బీజేపీ నేత‌ సుష్మాస్వ‌రాజ్ మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల పోటీలో బి.శ్రీరాములుతో పాటు వెలుగులోకి వ‌చ్చారు. ఇక ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీతో మొద‌లైన గాలి జ‌నార్ధ‌న రెడ్డి బిజినెస్.. ఆ త‌ర్వాత మైనింగ్ త‌వ్వ‌కాల్లో ప్ర‌వేశించి.. అతి త‌క్కువ కాలంలోనే మైనింగ్ వ్యాపారంలో కింగ్ అయ్యారు.

బ‌ల్లారి ఐర‌న్ ఓర్ (ఇనుము ధాతువు)కి చైనాలో మంచి డిమాండ్ ఉండ‌డంతో అక్క‌డికి ఎగుమ‌తి చేసిన జనార్ధ‌న రెడ్డి విప‌రీతంగా డ‌బ్బును సంపాదధించాడు. దీంతో నాడు అధికారంలో ఉన్న‌ జేడీఎస్‌-బీజేపీ కూట‌మి శాస‌న మండలిలోకి గాలిని తీసుకోవ‌డం జ‌రిగింది. ఇక 2008 ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ య‌డ్యూర‌ప్ప క్యాబినేట్‌లోకి మినిస్ట‌ర్‌గా ఎంట‌ర‌య్యారు గాలి. అంతే కాకుండా త‌న అన్న‌య్య క‌రుణాక‌ర్ రెడ్డి, శ్రీరాములు ఈ ఇద్ద‌రికి కూడా త‌న హావాతో మంత్రి వ‌ర్గంలో బెర్తులు ఇప్పించారు.

ఇక మైనింగ్ ద్వారా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో డ‌బ్బు సంపాదించిన గాలి.. డ‌జ‌న్ల కొద్ది కార్లు, హెలికాఫ్ట‌ర్లతో విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతూ తెలుగు సినీ క్యారెక్ట‌ర్స్‌ని గుర్తుకు తెప్పించాడు. అంత‌టితో ఆగ‌ని గాలి ఓబులా పురం మైనింగ్ కంపెనీ(OMC) పేరుతో రెండు ఉక్కు క‌ర్మాగారాలను ఏర్పాటు చేశాడు. బ‌ల్లారిలో ఒక‌టి. ఏపీ అనంత‌పురం జిల్లాలో మ‌రొక‌టి. ఆ టైమ్‌లో అప్ప‌టి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నుండి గాలీకి పూర్తి మ‌ద్ద‌తు ల‌భించింది.

క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో గాలి జ‌నార్ధ‌న రెడ్డి ప్రాభ‌వం ఎంత పెరిగిందంటే.. యడ్యూరప్ప ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌టానికి 60 మంది ఎమ్మెల్య‌ల‌ను హైద‌రాబాద్ రిసార్టులో ఉంచి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేసి రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఆ త‌ర్వాత ఓఎమ్‌సీ ద్వారా అక్ర‌మ‌మైనింగ్ జ‌రుగుతోంద‌ని గాలి జ‌నార్ధ‌న రెడ్డి పై అన్నివైపుల నుండి వ‌రుస ఆరోపణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. దీంతో ప్ర‌తిప‌క్షాల ఒత్తిడితో య‌డ్యూర‌ప్ప లోకాయుక్త దర్యాప్తునకు ఆదేశించారు.

ఇక ఆ త‌ర్వాత అప్పటి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో గాలి జ‌నార్ధ‌న రెడ్డికి స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో ఓఎమ్‌సీ పై ఏపీ స‌ర్కార్ సీబీఐ ఎంక్వ‌యిరీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ త‌ర్వాత య‌డ్యూర‌ప్ప పై కూడా అక్ర‌మ మైనింగ్ ఆరోప‌ణ‌లు రావ‌డం, ప‌ద‌విని కోల్పోవ‌డం, డి.వి స‌దానంద‌గౌడ్ ముఖ్య‌మంత్రి అవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. స‌దానంద గౌడ ముఖ్య‌మంత్రి అయ్యాక జ‌నార్ధ‌న్ రెడ్డి, శ్రీరాములుల‌ను మంత్రి వ‌ర్గం తొల‌గించారు.

ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 5, 2011న క‌ర్నాట‌క పోలీసు స్టేష‌న్లో గాలి జ‌నార్ధ‌న రెడ్డికి వ్య‌తిరేకంగా పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంతో సీబీఐ గాలిని అరెస్టు చేసింది. దీంతో నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభ‌వించిన త‌ర్వాత బ‌ల్లారిలో అడుగు పెట్ట కూడ‌ద‌నే ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ పై విడుద‌ల అయ్యారు గాలి జ‌నార్ధ‌న రెడ్డి. అయితే అప్ప‌టి నుండి బెంగుళూరు లోనే ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల‌ జ‌రిగిన క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెర‌వెను చ‌క్రం తిప్పార‌ని స‌మాచారం. గాలి జ‌నార్ధ‌న రెడ్డితో త‌న‌కు ఎలాంటి సంబంధంలేద‌ని బీజేపీ చెప్పినా.. మొన్న‌జరిగిన అసెంబ్లీ టిక్కెట్ల ఎంపీక‌లో గాలి జ‌నార్ధ‌న రెడ్డి చ‌క్రం తిప్పార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.