ఏపీ హాట్ న్యూస్ : వైసీపీ ఫైర్ బ్రాండ్‌తో ఆ నేత భేటీ..! మ‌ళ్లీ టీడీపీలోకి జంపింగా..?

Thursday, March 14th, 2019, 05:29:47 PM IST

ఏపీ రాజ‌కీయాలు క్ష‌ణానికోతీరున మారుతున్నాయి. అర‌టితొక్క వొలిచినంత ఈజీగా పార్టీ కండువాలు మార్చేస్తుండ‌టంతో ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీలో ఉండేదెవ‌రో.. వీడేదెవ‌రో తెలీక అధినేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. దీంతో పార్టీని వీడే వారిని బుజ్జ‌గించ‌లేక.. వ‌చ్చే వారిని వ‌ద్ద‌నలేని ప‌రిస్థితి అధినేత‌ల‌ది. ఇలా వైసీపీలోకి ఇటీవ‌ల వ‌ల‌స‌ల ప‌ర్వం ఊపందుకున్న సంగ‌తి తెలిసిందే.

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి చేరిక‌తో మొద‌లైన వైసీపీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం నేటికీ ప్ర‌హ‌స‌నంలా కొన‌సాగుతోంది. చోటా, మోటా స్థాయి నాయ‌కుల నుంచి బ‌డా నేత‌ల వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల లోట‌స్‌పాండ్ ముందు క్యూ క‌డుతున్నారు. ఇలా పారిశ్రామిక‌వేత్త‌లు, సినీరంగ ప్ర‌ముఖులు సైతం వైసీపీలో చేరుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతోంది.

వ‌రుస చేరిక‌ల‌తో ఆనందంలో తేలియాడుతున్న వైసీపీ శ్రేణుల‌కు హాట్‌.. హాట్ న్యూస్ అంటూ ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్‌తో ఆ నేత భేటీ అని, మ‌ళ్లీ టీడీపీలోకి జంపింగా..? అన్న పెద్ద పెద్ద హెడ్డింగుల‌తో ఆ క‌థ‌నం ద‌ర్శ‌న‌మిస్తోంది. ఇక ఆ క‌థ‌నానికి సంబంధించిన అస‌లు విష‌యానికొస్తే, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా, కొడాలి నానిని, టీడీపీ నేత‌గా వంగ‌వీటి రాధాను పేర్కొన్నాయి.

ఆ సోష‌ల్ మీడియా క‌థ‌నానికి సంబంధించి అస‌లు వివ‌రాలిలా ఉన్నాయి.. ఇటీవ‌ల త‌న కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన గుడివాడ నాయ‌కులు అదే నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏలూరు రోడ్డు స‌మీపంలో నిర్వ‌హించిన స‌మావేశానికి వంగ‌వీటి రాధా హాజ‌ర‌య్యార‌ట‌. ఆ విష‌యం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏలూరురోడ్డును ఆనుకుని ఉన్న ఫ‌ర్నీచ‌ర్ పార్కులో రాధాతో భేటీ అయ్యార‌ట‌.

వీరిద్ద‌రి భేటీలో మ‌రో నెల రోజుల వ్య‌వ‌ధిలోపు జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోగ‌ల 24వేల కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు త‌న‌కే ప‌డేలా పిలుపునివ్వాల‌ని కొడాలి నాని వంగ‌వీటిని కోరార‌ని, అందుకు ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు ఆ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది. అయితే, గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు గుడివాడ టీడీపీ కంచుకోట‌గా ఉన్న సంగతి తెలిసిందే. కొడాలి నాని టీడీపీని వీడ‌టంతో అది కాస్తా వైసీపీవైపు మ‌ళ్లింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనైనా గుడివాడ‌లో త‌మ ప‌ట్టును నిలుపుకోవాల‌ని టీడీపీ భావిస్తోంది.

ఈ క్ర‌మంలో త‌న బ‌లాన్ని పెంచుకునేందుకు కొడాలి నాని కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల కోసం వంగ‌వీటి రాధాను స‌హాయం కోరిన‌ట్లు ఆ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది. అయితే, బుధ‌వారం నాడు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు స‌మక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వంగ‌వీటి రాధా కొడాలి నానిని కూడా టీడీపీలో చేర‌మ‌ని ఆహ్వానించార‌ట‌. మ‌రి ఇద్ద‌రి చ‌ర్చ‌ల్లో భాగంగా టీడీపీలోనే ఉండి వైసీపీ త‌రుపున ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్న కొడాలి నానికి రాధా స్నేహ హ‌స్తం అందిస్తారా..? లేక పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల దృష్ట్యా హ్యాండిస్తారా..? అదీ కాక కొడాలి నానీనే టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారా..? అన్నది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దంటూ ఆ సోష‌ల్ మీడియా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.